Begin typing your search above and press return to search.

కోర్టు వాయిదాకు మరొకరిని పంపిన నేతశ్రీ.. షాకిచ్చిన న్యాయస్థానం!

కోర్టుకు హాజరు కావాల్సిన శ్రీనివాసరెడ్డి తనకు బదులుగా తన డ్రైవర్ మురారిని పంపాడు.కోర్టు గుమస్తా నిందితుల పేర్లు పిలిచే వేళలో.. మురారి కోర్టు హాల్లోకి వచ్చారు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 5:16 AM GMT
కోర్టు వాయిదాకు మరొకరిని పంపిన నేతశ్రీ.. షాకిచ్చిన న్యాయస్థానం!
X

హద్దులు దాటిన అతి తెలివిని ప్రదర్శించారో నేత. కోర్టు వాయిదాకు తనకు బదులుగా మరొకరిని పంపటం ద్వారా కోర్టు ఆగ్రహానికి గురయ్యాడు. ఇంతకూ అతనేమన్నా సాదాసీదా వ్యక్తా? అంటే కాదు. విజయవాడ నగర డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి భర్త అవుతు శ్రీనివాసరెడ్డి. అతగాడి అతి తెలివిని గుర్తించిన న్యాయస్థానం సీరియస్ అయ్యింది. అతడెక్కడున్నా.. కోర్టు ముందుకు హాజరు కావాలంటూ అల్టిమేటం విధించటంతో పరుగులు తీస్తూ కోర్టు ఎదుట హాజరైన అతడి ఉదంతాన్ని విన్నోళ్లంతా నోరెళ్లబెడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ 2015 ఆగస్టు 29న అప్పటి విపక్ష వైసీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో ధర్నాలో పాల్గొన్న తొమ్మిది మందిపై క్రిష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. అలా కేసు నమోదైన వారిలో శ్రీనివాసరెడ్డి ఒకరు. దీనిపై ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. మంగళవారం కోర్టు వాయిదా ఉంది.

కోర్టుకు హాజరు కావాల్సిన శ్రీనివాసరెడ్డి తనకు బదులుగా తన డ్రైవర్ మురారిని పంపాడు.కోర్టు గుమస్తా నిందితుల పేర్లు పిలిచే వేళలో.. మురారి కోర్టు హాల్లోకి వచ్చారు. అతడి తీరు తేడాగా ఉండటం.. వయసు కూడా ఎక్కువగా ఉండటంతో కోర్టు సిబ్బంది ఆయన్ను ప్రశ్నించారు. శ్రీనివాసరెడ్డి అతి తెలివి కోర్టుకు అర్థమైంది. తాను శ్రీనివాసరెడ్డికి బదులుగా కోర్టుకు వచ్చినట్లు చెప్పి.. ఆయన వాష్ రూంకు వెళ్లినట్లు చెప్పారు. దీంతో.. శ్రీనివాసరెడ్డిని వెంటనే పిలిపించాలని జడ్జి గాయత్రీదేవి ఆదేశించారు. కాసేపటికి హుటాహుటిన వచ్చిన శ్రీనివాసరెడ్డిని కోర్టు మందలించింది. కోర్టులంటే ఆషామాషీ అనుకుంటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏదైనా ఉంటే న్యాయస్థానానికి చెప్పాలే కానీ వేరే వారిని పంపుతారా? అంటూ సంజాయిషీ లేఖ రాయించి.. పంపారు. గేమ్స్ ఎవరితో ఆడినా ఫర్లేదు. కానీ.. కోర్టుతో ఆడకూడదన్న చిన్న విషయాన్ని మిస్ కావటం ఏంటి?