Begin typing your search above and press return to search.

కేసు మెడ‌కు.. సీటుకు ఎస‌రు?

రాష్ట్రంలో మ‌రో రెండు నెలల్లో ఎన్నిక‌లు రావొచ్చ‌నే ప్రచారం నేప‌థ్యంలో ఇప్పుడు మంత్రి రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై కారుమ‌బ్బులు క‌మ్ముకున్నాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   12 Aug 2023 11:08 AM GMT
కేసు మెడ‌కు.. సీటుకు ఎస‌రు?
X

తెలంగాణ ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపు.. ప్రస్తుతం మంత్రిగా బాధ్య‌త‌లు.. మూడోసారి గెల‌వ‌డం కోసం క‌స‌ర‌త్తులు.. కానీ ఇంత‌లోనే బీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు అనుకోని అవ‌రోధం ఏర్ప‌డింది. అఫిడ‌విట్ ట్యాంప‌రింగ్ వివాదంలో పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం శ్రీనివాస్ గౌడ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ కేసులో ఆయ‌న మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో మ‌రో రెండు నెలల్లో ఎన్నిక‌లు రావొచ్చ‌నే ప్రచారం నేప‌థ్యంలో ఇప్పుడు మంత్రి రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై కారుమ‌బ్బులు క‌మ్ముకున్నాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో అఫిడ‌విట్‌ను స‌మ‌ర్పించిన త‌ర్వాత‌, తిరిగి దీన్ని తీసుకుని స‌వ‌రణ‌లు చేసి ఇచ్చార‌న్న‌ది మంత్రిపై అభియోగం. ఇది చ‌ట్ట విరుద్ధ‌మంటూ ఆయ‌న‌పై దాఖ‌లైన పిటిష‌న్ల‌పై విచారించిన నాంప‌ల్లిలోని ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు శ్రీనివాస్ గౌడ్‌పై కేసు న‌మోదు చేయాల‌ని పోలీసుల‌కు సూచించింది.

కానీ రోజులు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో ప్ర‌జాప్ర‌తినిధులు కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో మంత్రితో పాటు ఎన్నిక‌ల క‌మిష‌న్‌, రెవెన్యూశాఖ‌కు చెందిన 11 మందిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. మ‌రోవైపు హైకోర్టులోనూ ఈ ట్యాంప‌రింగ్ కేసుపై విచార‌ణ కొన‌సాగుతోంది. తీర్పు శ్రీనివాస్‌గౌడ్‌కు ప్ర‌తికూలంగా వ‌స్తే ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌.

ఇప్ప‌టికే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావుపై హైకోర్టు అన‌ర్హ‌త వేటు వేయ‌గా.. ఆయ‌న సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా అలాగే చేసే అవ‌కాశ‌ముంద‌ని చెబుతున్నారు. ఏదేమైనా ఎన్నిక‌ల‌కు ముందు ఈ కేసు శ్రీనివాస్ గౌడ్ సీటుకు ఎస‌రు పెట్టే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.