సిక్కోలు రాజకీయం ఆసక్తికరం.. వైసీపీ నేతను సన్మానించిన టీడీపీ ఎమ్మెల్యేలు!
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్న అధికార టీడీపీ, వైసీపీ నేతలు ఈ జిల్లా మాత్రం ఆ సంస్కృతికి తావు లేదని సంకేతాలు పంపుతూ అందరినీ ఆకర్షించారు.
By: Tupaki Desk | 23 Sept 2026 9:15 PM ISTఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్న అధికార టీడీపీ, వైసీపీ నేతలు ఈ జిల్లా మాత్రం ఆ సంస్కృతికి తావు లేదని సంకేతాలు పంపుతూ అందరినీ ఆకర్షించారు. వైసీపీ నేతలతో టీడీపీ నేతలు వేదిక పంచుకోవడం ఇటీవల కాలంలో తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ నేతలను వైసీపీ వారితో వేదిక పంచుకోవద్దని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. కానీ, శ్రీకాకుళం జిల్లాలో మాత్రం విపక్షానికి చెందిన వైసీపీ నేతను టీడీపీ ఎమ్మెల్యేలు సత్కరించడం ఆకర్షించింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వర వడికి తెర తీసిందని అంటున్నారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ సత్కార సభలో టీడీపీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, మామిడి గోవిందరావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పరిణామం జిల్లాలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తుందా? అనే చర్చకు దారితీసింది. జడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ పదవీకాలం గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పాలకవర్గ చివరి సమావేశం సందర్భంగా చైర్ పర్సన్ ను సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గరుండి జరిపించడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి వాతావరణం కనిపించలేదని, ఒక్క శ్రీకాకుళంలో మాత్రమే భిన్నంగా వైసీపీ నేతను టీడీపీ ఎమ్మెల్యేలు సత్కరించిన తీరు అబ్బురపరిచిందని అంటున్నారు.
ఇక ఈ పరిణామంతో రాజకీయంగా ఏమైనా మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయా? అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. జడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ భర్త సాయిరాజు గతంలో టీడీపీలో ఉండేవారు. 2009లో ఇచ్చాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత వైసీపీలో చేరారు. రెండుసార్లు ఆ పార్టీ తరఫున గెలిచినా ఓటమే మూటగట్టుకున్నారు. ఇక గత స్థానిక ఎన్నికల్లో సాయిరాజు భార్యకు వైసీపీ జడ్పీ చైర్ పర్సన్ గా అవకాశం ఇచ్చింది. ఇక ఇప్పుడు ఆమె టీడీపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగించడం చూస్తుంటే కూటమిలోకి మారే ఆలోచన చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని అధికార టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలో గుట్టుగా వైసీపీ నేతలతో చర్చలు జరుపుతూ పార్టీలో చేర్చుకుంటోంది. దీనికి విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను టీడీపీలో చేరడమే పెద్ద ఉదాహరణగా చెబుతున్నారు. ఇక శ్రీకాకుళంలోనూ ఇటువంటి ఆపరేషన్ చేస్తోందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా పరిషత్ లో మొన్నటి వరకు వైసీపీ జడ్పీటీసీతో తీవ్ర వాదోపవాదాలకు దిగిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు వారిని సన్మానించి సాదరంగా సాగనంపడం చూస్తుంటే ఆపరేషన్ ఆకర్ష్ కు అనుగుణంగా అడుగులు పడుతున్నట్లే ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి శ్రీకాకుళం జడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ సన్మాన సభకు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరుకావడం కొత్త రాజకీయ చర్చకు కేంద్రమైందని అంటున్నారు.
