వామ్మో వీడు మామూలు దొంగ కాదు.. 60 సార్లు జైలు, 218 చోట్ల చోరీలు!!
రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మోస్ట్ వాంటెడ్ గజదొంగను శ్రీకాకుళం జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
By: Tupaki Political Desk | 23 Nov 2025 3:02 PM ISTరెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మోస్ట్ వాంటెడ్ గజదొంగను శ్రీకాకుళం జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకే చెందిన ఈ గజదొంత చరిత్ర చూస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే.. రాష్ట్రంలో దొంగతనం చేయడం, చోరీ సొత్తుతో ఉడాయించడం.. పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు సవాల్ విసరడం ఈ మహాచోరుడికి పరిపాటైంది. గతంలో 60 కేసుల్లో అతడిని అరెస్టు చేస్తే, బెయిలుపై బయటకు వచ్చి మళ్లీ తన వృత్తిని కొనసాగిస్తూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తాజాగా మరోసారి పోలీసులకు చిక్కాడు. ఆధార్ కార్డు, సెల్ ఫోన్ వంటివేవీ వాడకుండానే రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతుండటంతో అతడిని గుర్తించడం పోలీసులకు కూడా చాలా కష్టమైందని అంటున్నారు.
శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం చాపరకు చెందిన దున్న కృష్ణ అలియాస్ ప్రీతమ్ కృష్ణ సింగ్ దొంగతనాల్లో ఆరితేరాడు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన సయ్యద్ రఫీ అనే మరో దొంగతో కలిసి దున్న కృష్ణ రెండు రాష్ట్రాల్లో దాదాపు 218 చోట్ల చోరీలకు పాల్పడ్డాడు. దొంగతనం చేయడం పోలీసులు అరెస్టుచేస్తే జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చేవాడు. మళ్లీ దొంగతనం చేసి పోలీసులకు సవాల్ విసిరేవాడు. ఇటీవల శ్రీకాకుళం రూరల్ మండలంలో ఓ ఇంటిలో దొంగతనం చేసిన కృష్ణను తాజాగా మరోసారి పట్టుకున్నారు. స్థానికంగా దొంగతనం చేసిన కృష్ణ చోరీ సొత్తుతో కలకత్తా వెళ్లిపోతున్నాడు. దీంతో అతడి ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు చాలా కష్టంగా మారింది.
రెండు నెలల క్రితం శ్రీకాకుళం రూరల్ మండలంలో దొంగతనం చేసిన కృష్ణను పట్టుకునేందుకు పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలోనే మళ్లీ దోపిడీకి పథకం రచించిన నిందితుడు శ్రీకాకుళం పోలీసులకు చిక్కాడు. ఈ సారి నిందితుడి సహచరుడు రఫీని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరి నుంచి దాదాపు రూ.33.25 లక్షల విలువైన బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణపై మొత్తం 218 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో 60 కేసులకు సంబంధించి అతడు జైలుకు వెళ్లి వచ్చాడు.
ఇక తాజాగా అతడిని అరెస్టు చేసిన పోలీసులు 50 కిలోల బంగారం, 300 కిలోల వెండి, ఒక కిలో ప్లాటినం ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. కృష్ణపై శ్రీకాకుళం నగరం పరిధిలో మూడు పోలీసుస్టేషన్లలో 18 కేసులు పెండింగులో ఉన్నాయి. తరచూ కలకత్తా నుంచి శ్రీకాకుళం వస్తూ చోరీ చేసి పారిపోతున్న కృష్ణను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు భావించారు. అతడి కదలికలపై నిఘా పెంచగా, శ్రీకాకుళం నగర శివర్లలోని ఓ ఇంట్లోకి ప్లాన్ చేసి దొరికిపోయాడు. శ్రీకాకుళం నగరానికి ఆనుకుని చెన్నై-కలకత్తా జాతీయ రహదారి ఉండటంతో గజదొంగ కృష్ణ సులువుగా పారిపోతున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
