రామ్మోహన్ సాధించారు...సిక్కోలు కి కొత్త ఊపిరి
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా మూడు సార్లు గెలిచారు.
By: Satya P | 8 April 2026 1:00 PM ISTకేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా మూడు సార్లు గెలిచారు. ఆయన 2024 ఎన్నికల తరువాత కేంద్ర కేబినెట్ లో మంత్రి అయ్యారు. రెండేళ్ళు పూర్తి కావస్తోంది జిల్లాకు కేంద్ర మంత్రి ఏమి చేశారు అన్న చర్చ అయితే అంతటా వస్తోంది. ఎయిర్ పోర్టు ని నిర్మిస్తామని కేంద్ర మంత్రి చెబుతున్నా దాని కంటే ఎన్నో కీలక సమస్యలు జిల్లాలో ఉన్నాయని అంతా అంటున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులని టేకప్ చేస్తే వెనకబడిన జిల్లా దశ తిరుగుతుందని అంతా కోరుతున్నారు. మొత్తానికి ఈ విన్నపాల మీద కేంద్ర మంత్రి పాజిటివ్ గానే స్పందించారు. ఆయన వంతుగా తన పలుకుబడిని ఉపయోగించి కేంద్ర స్థాయిలో సాధించుకుని వచ్చారు. అదే నేరడి ప్రాజెక్ట్ కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్.
దశాబ్దాల పోరాటం :
నేరడి ప్రాజెక్ట్ అన్నది దశాబ్దాలుగా సాగుతున్న పోరాటం. శ్రీకాకుళం జిల్లా వాసుల కల కూడా. ఈ సమస్యపై సుదీర్ఘకాలంగా ఉద్యమం చేస్తున్న శ్రీకాకుళం ప్రజలకు గెజిట్ నోటిఫికేషన్ గొప్ప శుభవార్త అని అంటున్నారు. ముఖ్యంగా జిల్లా సాగునీటి రంగానికి ఇది ముందడుగుగా పేర్కొంటున్నారు. అలాగే జిల్లా స్థాయిలో నీటి భద్రత కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది గొప్ప శుభవార్తగా నిలిచిందని చెప్పాల్సి ఉంది. నేరడి ప్రాజెక్టు ఇప్పుడు నిర్మాణం వైపు అడుగులు వేస్తూ ఉండటం అన్నది శ్రీకాకుళం ప్రగతికి కీలకమైన మైలురాయిగా చెబుతున్నారు.
వంశధార నీటితో :
జిల్లాలోని రైతాంగానికి ప్రజలకు నేరడి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే సాగు తాగు నీరు లభిస్తాయి. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ సాఖ నెరడి ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ జిల్లాకు సాధించి పెట్టిన మంచి ప్రాజెక్ట్ అని అంటున్నారు. దీంతో జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేరడి నోటిఫికేషన్ చరిత్రాత్మకం:
దీని మీద మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేరడి నోటిఫికేషన్ చరిత్రాత్మకం అని అభివర్ణించారు. నోటిఫికేషన్ కు అనుగుణంగా ఏర్పడిన సవరణలు మిగులు జలాల లెక్కలు, నేరడి నిర్మాణానికి తొలగిన అడ్డంకులు, భవిష్యత్ లో జిల్లాలో ప్రగతి దారులను తెరుస్తాయని రామ్మోహన్ నాయుడు చెప్పారు. నేరడి ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకొని త్వరగా పూర్తి చేసి, ప్రజలకు ప్రయోజనాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారనీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.
వ్యవసాయాన్ని బలోపేతం చేస్తూ :
ఈ ప్రాజెక్టు కేవలం మౌలిక సదుపాయాల పథకం మాత్రమే కాకుండా శ్రీకాకుళం జిల్లాను సమృద్ధి స్థిరత్వం కలిగిన ప్రాంతంగా మార్చే జీవనాధారమని ఆయన చెప్పరు. అలాగే జిల్లాలో వ్యవసాయాన్ని బలోపేతం చేస్తూ అన్ని విధాలుగా జీవనోపాధులను మెరుగుపరచి రైతుల భవిష్యత్తుకి మరింతగా భరోసా ఇస్తుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. మొత్తం మీద చూస్తే రామ్మోహన్ నాయుడు సాధించారు. ఇన్నాళ్ళు జిల్లాకు కేంద్ర మంత్రి ఏమి చేశారు అన్న ప్రత్యర్ధులకు నెరడి ప్రాజెక్ట్ కి అడ్డంకులు తొలగించి గెజిట్ నోటిఫికేషన్ తీసుకుని రావడం ద్వారా రామ్మోహన్ సరైన జవాబు చెప్పారని అంటున్నారు.
