Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబుతో బీజేపీ ఎంపీ ఈటల భేటి.. కథేంటి?

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి శ్రీధర్ బాబు ప్రముఖంగా ప్రస్తావించారు.

By:  Tupaki Desk   |   6 April 2025 1:22 PM IST
కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబుతో బీజేపీ ఎంపీ ఈటల భేటి.. కథేంటి?
X

రెండు విరుద్ధ పార్టీలు.. రాజకీయంగా ప్రత్యర్థులు.. కానీ అధికారంలో ఉన్నవారు.. ఒకే జిల్లాకు చెందిన వారు.. ఈ ఉద్దండ నేతల భేటి సహజంగానే అనేక రకాల ఊహాగానాలకు దారితీస్తుంది. అయితే అభివృద్ధి గురించే ఈ కలయిక జరిగిందని పైకి చెబుతున్నా నేతలు మాత్రం వీరి భేటి వెనుక అంతకుమించి ఆలోచిస్తున్నారు. శ్రీధర్ బాబుతో ఈటల రాజేందర్ భేటి రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపింది.

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్ భేటి కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలను పరిష్కరించాలని మంత్రి శ్రీధర్ బాబును ఈటల రాజేందర్ కోరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు దృష్టికి నియోజకవర్గంలోని తాగునీటి సరఫరా సమస్య, రోడ్ల దుస్థితి, చెరువులు మురికికూపాలుగా మారడం వంటి అంశాలను ఈటల రాజేందర్ తీసుకువెళ్లారు.

అంతేకాకుండా 'హైడ్రా' పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న బ్లాక్ మెయిలర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రిని ఆయన అభ్యర్థించారు. చిన్న దేవాలయాలను కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఈటల రాజేందర్ మంత్రికి వివరించారు. హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా డంప్ యార్డులు ఏర్పాటు చేయాలని, బాలాజీనగర్‌కు మాత్రమే చెత్తను తరలిస్తే అక్కడి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని కూడా ఈటల రాజేందర్ మంత్రిని కోరారు. ఈ సమస్యలన్నింటిపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారని ఈటల రాజేందర్ తెలిపారు.

మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం(జీఐబీఎఫ్) ఆధ్వర్యంలో పార్క్ హయత్‌లో జరిగిన 'ఇండియా - లాటిన్ అమెరికా, కరీబియన్ కంట్రీస్ బిజినెస్ కాంక్లేవ్' రెండో ఎడిషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరించారు. లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి శ్రీధర్ బాబు ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధించడం ఒక రకంగా భారతదేశానికి మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న పారిశ్రామికవేత్తలు భారత్ వైపు చూస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలంగాణకు మరింత పెట్టుబడిని ఆకర్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.