Begin typing your search above and press return to search.

శ్రీరెడ్డిని క్షమించిన ఏపీ పోలీసులు.? తొలిసారి పోలీసుస్టేషనుకు వచ్చిన జగనన్న అభిమాని..

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, యువనేత లోకేశ్ పై దారుణంగా వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదైన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 April 2025 7:05 PM IST
శ్రీరెడ్డిని క్షమించిన ఏపీ పోలీసులు.? తొలిసారి పోలీసుస్టేషనుకు వచ్చిన జగనన్న అభిమాని..
X

ఏపీ మాజీ సీఎం జగనన్న అభిమానిని అంటూ యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన సినీ నటి శ్రీరెడ్డిని ఏపీ పోలీసులు క్షమించారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలను వెంటాడి వెంటాడి అరెస్టు చేయడమే కాకుండా, జైలు జీవితం ఎలా ఉంటుందో చూపిస్తున్న పోలీసులు శ్రీరెడ్డి విషయంలో మాత్రం కాస్త దయతో వ్యవహరించారు. బూతులు, అనుచిత వ్యాఖ్యల విషయంలో గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ తో పోటీపడినట్లు వీడియోలు చేసిన శ్రీరెడ్డిని అరెస్టు చేయకుండా 41ఏ నోటీసు ఇచ్చి విడచిపెట్టడం చర్చనీయాంశమవుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, యువనేత లోకేశ్ పై దారుణంగా వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే కొన్ని కేసుల్లో ఆమెకు ఇప్పటికే ముందస్తు బెయిల్ వచ్చేలా ప్రభుత్వం సహకరించగా, తాజాగా విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు. గత నవంబరులో శ్రీరెడ్డిపై నెల్లిమర్ల పోలీసుస్టేషన్ లో కేసు నమోదు అవ్వగా, చెన్నైలో ఉన్న ఆమె నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులిచ్చారు. దీంతో శనివారం పూసపాటిరేగ పోలీసుస్టేషన్ కు వచ్చిన శ్రీరెడ్డికి సీఐ రామక్రిష్ణ విచారించి ఆ తర్వాత 41ఏ నోటీసు ఇచ్చారు. దీంతో శ్రీరెడ్డి అరెస్టు నుంచి తప్పించుకున్నారు.

వాస్తవానికి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ వంటివారినే ముందుగా అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. ప్రధానంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇళ్లలో మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిని విడిచిపెట్టొద్దని డిమాండ్ వినిపించింది. అయితే తొలుత బోరుగడ్డతోపాటు ఆ తర్వాత మిగిలిన సోషల్ మీడియా యాక్టవిస్టులను అరెస్టు చేస్తున్న క్రమంలో శ్రీరెడ్డి బెదిరిపోయారు. తాను తప్పు చేశానని, పెళ్లి కావాల్సిన ఆడపిల్లను అని క్షమించి విడిచిపెట్టాలని వీడియో విడుదల చేశారు.

శ్రీరెడ్డి వేడుకున్న క్రమం, మహిళా సెంటిమెంటును శ్రీరెడ్డి వాడుకోవడం వల్ల కూటమి పెద్దలు ఆమె విషయంలో కాస్త దయతో వ్యవహరించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీంతో కొన్ని కేసుల్లో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు కాగా, తాజాగా 41ఏ నోటీసులతో అరెస్టు చేయకుండా విజయనగరం పోలీసులు విడిచిపెట్టారు. ఇదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి క్రిష్ణవేణి అరెస్టు చర్చనీయాంశమవుతోంది. మహిళగా శ్రీరెడ్డిని క్షమించిన ప్రభుత్వం పాలేటి క్రిష్ణవేణిపై కఠినంగా వ్యవహరించిందని అంటున్నారు. అయితే శ్రీరెడ్డి తన తప్పు తెలుసుకోవడంతోపాటు ఆ తర్వాత ఎలాంటి వీడియోలు చేయలేదని, క్రిష్ణవేణి మాత్రం రోజూ ఏదో ఒక పోస్టుతో ప్రభుత్వానికి చికాకు తెప్పిస్తుండటంతో అరెస్టు చేశారని అంటున్నారు.