ఉప్పల్‌లో లోపల మ్యాచ్.. బయట అభిమానుల ఆగ్రహం!
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్.ఆర్.హెచ్) మ్యాచ్ సందర్భంగా అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి.
By: A.N.Kumar | 5 April 2026 5:00 PM ISTహైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్.ఆర్.హెచ్) మ్యాచ్ సందర్భంగా అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వైపు స్టేడియంలో మ్యాచ్ సందడి కొనసాగుతుండగా మరో వైపు బయట అభిమానులు తీవ్ర అసంతృప్తితో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కారణం స్టేడియంలోకి అనుమతించే వస్తువులపై అమలు చేస్తున్న కఠిన నియమాలు.
హైదరాబాద్ నగర పోలీసుల భద్రతా చర్యలు ఎప్పటినుంచో కఠినంగానే ఉంటాయి. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో భద్రతా నియంత్రణలు మరింత కఠినంగా అమలు చేస్తారు. అయితే ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా మారింది. ఇప్పటికే ఇయర్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి వస్తువులను అనుమతించకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తుండగా, తాజాగా వాలెట్‌లను కూడా అనుమతించబోమని ప్రకటించడం అభిమానుల్లో ఆగ్రహానికి దారితీసింది.
మ్యాచ్ ప్రారంభానికి కేవలం కొద్ది నిమిషాల ముందు స్టేడియం వద్దకు చేరుకున్న అనేక మంది అభిమానులను వాలెట్‌లతో వచ్చిన కారణంగా భద్రతా సిబ్బంది నిలిపివేశారు. ఈ నిర్ణయం ముందుగా ఎక్కడా ప్రకటించలేదని ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అభిమానులు వాదిస్తున్నారు. "వాలెట్ లేకుండా ఎలా వస్తాం? డబ్బు, కార్డులు ఎక్కడ పెట్టుకోవాలి?" అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ అకస్మాత్తు నిర్ణయం వల్ల స్టేడియం బయట గందరగోళ పరిస్థితి నెలకొంది. టికెట్లు ఉన్నప్పటికీ లోపలికి వెళ్లలేకపోయిన అభిమానులు నిరసనకు దిగారు. కొందరు పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు.
ఇదే సమయంలో భద్రతా అధికారుల నిర్ణయాన్ని పూర్తిగా తప్పు పట్టలేమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. భారీ జనసందోహం, భద్రతా ముప్పులు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కఠిన నియమాలు అమలు చేయడం తప్పనిసరి అని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ, ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఈ సమస్య తీవ్రరూపం దాల్చిందని స్పష్టంగా కనిపిస్తోంది.
గతంలో కూడా ఉప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లపై విమర్శలు వచ్చాయి. కానీ ఈసారి వాలెట్‌ల నిషేధం కొత్త వివాదానికి తెరలేపింది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే స్పష్టమైన మార్గదర్శకాలు, ముందస్తు ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం పరిస్థితి ఎలా పరిష్కారమవుతుందో చూడాలి. అభిమానుల అసంతృప్తిని తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
