Begin typing your search above and press return to search.

బాలయ్య అభిమానులకు ఈస్ట్ గోదావరి ఎస్పీ హెచ్చరిక!

ఆల్ ఇండియా బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో చలో రాజమండ్రి సెంట్రల్ జైలు కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే దీనికి ప్రభుత్వ అనుమతి లేదని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు.

By:  Tupaki Desk   |   5 Oct 2023 6:14 AM GMT
బాలయ్య అభిమానులకు ఈస్ట్  గోదావరి ఎస్పీ హెచ్చరిక!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ టీడీపీ శ్రేణులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే "మోత మోగిద్దాం", "సత్యమేవ జయతే" వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంతక ముందు చలో రాజమండ్రి అంటూ హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగులు కార్ల ర్యాలీకి ప్రయత్నించారు.

అదే సమయంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి, సైబర్ టవర్స్ ప్రాంతాల్లో బాబు అరెస్టుపై నిరసనలు తెలపడానికి ప్రయత్నించారు. అయితే అందుకు తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం అంగీకరించలేదు. ఎక్కడికక్కడ పోలీసులను మొహరించి.. ఎలాంటి నిరసన కార్యక్రమాలూ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఈ సమయంలో తాజాగా బాలకృష్ణ ఫ్యాన్స్.. చలో రాజమండ్రి కార్యక్రమాన్ని తెలపెట్టబోతున్నారని సోషల్ మీడియాలో పోస్టింగులు వచ్చాయి.

అవును... చంద్రబాబు అరెస్టుకు నిరసనగా... ఆల్ ఇండియా బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో చలో రాజమండ్రి సెంట్రల్ జైలు కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే దీనికి ప్రభుత్వ అనుమతి లేదని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లాలో సెక్షన్ 144 అమలులో ఉన్నందున ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ఈ నిబంధనలను అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. అయితే... చలో రాజమండ్రి పేరున బాలయ్య అభిమానులు పెట్టారని చెబుతున్న సోషల్ మీడియా పోస్ట్... ఫేక్ పోస్ట్ అని తేలిందని తెలుస్తుంది. అంతకంటే ముందు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో... పోలీసులు అలర్ట్ అయ్యారు.

ఇందులో భాగంగా... నంద్యాలలో మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్ సహా ఆరుగురు బాలయ్య అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు పోలీస్‌ స్టేషన్‌ లో నిర్బంధించారు. అయితే.. సోషల్ మీడియాలో వచ్చింది ఫేక్ పోస్టింగ్ అని ఇంటెలిజెన్స్ అధికారులు నిర్ధారించిన అనంతరం... అర్ధరాత్రి వారిని పోలీసులు వదిలిపెట్టారు!