Begin typing your search above and press return to search.

స్పైస్ జెట్ టేకాఫ్ అయ్యే వేళలో ఇద్దరు మహిళల హల్ !

ఈ ఇద్దరు మహిళల్ని సిబ్బంది ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికి వారు మాట వినకుండా బలవంతంగా కాక్ పిట్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు.

By:  Tupaki Desk   |   15 July 2025 10:18 AM IST
స్పైస్ జెట్ టేకాఫ్ అయ్యే వేళలో ఇద్దరు మహిళల హల్ !
X

దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబయి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో ఇద్దరు మహిళలు వ్యవహరించిన వింత వైఖరి సంచలనంగా మారింది. మిగిలిన ప్రయాణికులను భయాందోళనలకు గురి చేయటంతో పాటు.. సదరు విమానం ఏకంగా ఏడు గంటలు ఆలస్యమైంది. విమానం టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న వేళ.. సదరు ఇద్దరు యువతులు కాక్ పిట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించటం.. ఎంత వారించినా వినకపోవటంతో విమానాన్నినిలిపేశారు.

ఢిల్లీ విమానాశ్రయంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. స్పైస్ జెట్ విమానం ఢిల్లీనుంచి ముంబయికి మధ్యహ్నం 12.30గంటల ప్రాంతంలో బయలుదేరాల్సి ఉంది. సరిగ్గా విమానాన్నిటేకాఫ్ చేసేందుకు ట్యాక్సీయింగ్ కు తీసుకొచ్చారు. ఈ సమయంలో ఇద్దరు యువతులు వింతగ ప్రవర్తించటం మొదలు పెట్టారు. హటాత్తుగా తమ సీట్లలో నుంచి లేచిన వారు.. పైలెట్లు ఉండే కాక్ పిట్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు.

ఈ ఇద్దరు మహిళల్ని సిబ్బంది ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికి వారు మాట వినకుండా బలవంతంగా కాక్ పిట్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోటి ప్రయాణికులతో పాటు..క్యాబిన్ సిబ్బంది ఎంత చెప్పినా వినలేదు. తమ సీట్లలో వెళ్లి కూర్చునేందుకు ససేమిరా అన్నారు.

ఈ గందరగోళ పరిస్థితిని తెలుసుకున్న పైలెట్లు విమానాన్నిబే వే వద్దకు తీసుకొచ్చి.. సదరు ఇద్దరు మహిళా ప్రయాణికుల్ని కిందకు దించేసి.. సీఐఎస్ఎఫ్ కు అప్పగించినట్లుగా స్పైస్ జెట్ వెల్లడించింది. ఈ అనూహ్య ఉదంతంతో విమానం ఏడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. మధ్యాహ్నం12.30 గంటలకు టేకాఫ్ తీసుకోవాల్సిన విమానం.. రాత్రి 7.31 గంటలకే టేకాఫ్ అయ్యింది. అనధికారిక సమాచారం ప్రకారం.. సదరు ఇద్దరు మహిళలుమద్యం మత్తులో ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. దీనిపై ఎలాంటి అధికారికప్రకటన వెలువడలేదు.