Begin typing your search above and press return to search.

తనకు ఆ పదవి ఇవ్వడంపై స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి దళిత స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కు అవకాశం కల్పించింది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 5:55 AM GMT
తనకు ఆ  పదవి ఇవ్వడంపై స్పీకర్  ఆసక్తికర వ్యాఖ్యలు!
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సుమారు 10ఏళ్ల తర్వాత రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీనియర్లు, జూనియర్లు అనే తారతమ్యాలేమీ లేకుండా అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ అధిష్టాణం కేబినెట్ ని సమకూర్చింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి దళిత స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కు అవకాశం కల్పించింది. ఆ స్థానానికి ఆయన హుందాతనం సెట్ అవుతుందని చెబుతున్నారు!

ఈ సమయంలో తనకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి ఇవ్వడంపై గడ్డం ప్రసాద్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా అసలు తనకు ఈ స్పీకర్ పదవి ఎందుకు ఇచ్చారో తెలియదని అన్నారు. తానొక మాస్ లీడర్ ని అని... అలాంటి తనను తీసుకెళ్లి స్పీకర్ కుర్చీలో కుర్చోబెట్టారని.. ఫలితంగా ఆ పదవి తన కాళ్లూ చేతులూ కట్టేసినట్లు అయిపోయిందంటూ స్పందించారు ప్రసాద్. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

అవును... హైదరాబాద్ రవీంద్రభారతిలో గోల్కొండ సాహితీ కళాసమితి, అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక, తెలుగు భాష చైతన్య సమితి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, లక్ష్య సాధన ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అసెంబ్లీ స్పీకర్‌ గా నియమితులైన గడ్డం ప్రసాద్ కు ఘనంగా సన్మానం జరిగింది. అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో సన్మానం సందర్భంగా స్పందించిన గడ్డం ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తాను మాస్ లీడర్‌ ను అని.. సీఎం రేవంత్ రెడ్డి తనకు స్పీకర్ పదవి ఇచ్చి కాళ్లు, చేతులు కట్టేశారంటూ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో... ఊర్లల్లో తిరుగుతూ, అందరితో కలిసి స్నేహంగా ఉండే తనకు ఈ పదవి చాలా కొత్తగా ఉందని తెలిపారు. తనపై నమ్మకంతో సీఎం రేవంత్ రెడ్డి అప్పగించిన ఈ రాజ్యాంగ పదవికి న్యాయం చేస్తానని.. తన విధులను సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకుంటానని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో అధిష్ఠానం ఏది ఆలోచించి తనకు ఈ పదవి ఇచ్చారో తెలియదు కానీ.. నమ్మి ఇచ్చిన ఈ రాజ్యాంగ పదవిని సక్రమంగా నెరవేరుస్తానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి స్పీకర్‌ గా ఒకప్పుడు గడ్డం ప్రసాద్ ఉండేవారని భవిష్యత్ తరాలు చెప్పుకునేలా పని చేస్తానని అన్నారు. ఇదే సమయంలో గత పాలకులు కవులకు గౌరవం ఇవ్వలేదని.. తను మాత్రం ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా అన్నివిధాలా అండగా ఉంటానని అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేశారు.