'నాకు కొంత ఆవేదన ఉంది' స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు
ప్రజాస్వామ్యంలో గెలుపోటములు వస్తాయని, అయితే ప్రతిపక్షంగా ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకువెళ్లడంలో లోటుపాట్లు ఉంటే అసెంబ్లీకి వచ్చి చెప్పాలని సూచించారు.
By: Tupaki Desk | 25 Sept 2025 8:33 PM ISTఅసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సభలో శాంతిభద్రతలపై స్వల్ప చర్చ జరిగింది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చర్చను ప్రారంభించగా, ఆయన మాట్లాడిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు కల్పించుకున్నారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్నప్పటికీ నాకు కూడా కొంత ఆవేదన కలుగుతోందని అంటూనే మాజీ సీఎం జగన్మోహనరెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సభలో జగన్ పేరు ప్రస్తావించకుండానే ‘ప్రతిపక్ష హోదా’ కోసం వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా అసెంబ్లీని ఉద్దేశించి కొంతసేపు మాట్లాడతానని చెప్పిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు విపక్ష నేతలు మాట్లాడుతున్న భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘రోజూ టీవీలు, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.. వారు మాట్లాడే తీరు. మళ్లీ మేమే వస్తాం, మీ అంతుచూస్తాం, పీకలు కోస్తాం.. రప్పా.. రప్పా అంటూ సినిమా డైలాగులు చెబుతున్నారు. ఎన్టీఆర్ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మేము కూడా ఓడిపోలేదా? ఓడిపోతే రప్పా.. రప్పా నా? ఇందిరాగాంధీ వంటి మహానాయకులు ఓడిపోలేదా? మీలా మాట్లాడను ఆవేశం వస్తుంది. అయితే కంట్రోల్ చేసుకోవాల్సివస్తుంది’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యంలో గెలుపోటములు వస్తాయని, అయితే ప్రతిపక్షంగా ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకువెళ్లడంలో లోటుపాట్లు ఉంటే అసెంబ్లీకి వచ్చి చెప్పాలని సూచించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని హితవుపలికారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటారని తెలిపారు. సభకు రారు, ఎమ్మెల్యేలను రానివ్వరు క్వశ్చనులు మాత్రం పంపుతునన్నారని స్పీకర్ తెలిపారు. ప్రజలు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని స్పీకర్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా 1978 నాటి అసెంబ్లీలో జరగిన సంఘటనను స్పీకర్ అయ్యన్నపాత్రుడు గుర్తుచేశారు. నాటి ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున సర్దార్ గౌతు లచ్చన్న నాయకత్వంలో 64 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారని, అప్పట్లో తగినంత సంఖ్యాబలం ఉండటం చేత ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెప్పారు. అయితే ఎన్నికలు జరిగిన కొద్దిరోజుల్లోనే నాటి రాజకీయాల వల్ల కొందరు జనతాపార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరితే సర్దార్ గౌతు లచ్చన్న సభకు వచ్చి ఎవరూ అడగకపోయినా తన ప్రతిపక్ష హోదాకు రాజీనామా చేశారని వెల్లడించారు.
అయితే ఇప్పుడు నెంబర్ లేకుండా నాకెందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు అంటున్నారు. చివరకు నాపై హైకోర్టుకు వెళ్లారు, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారు. నేను ఎక్కువ మాట్లాడను. అయినా మాట్లాడాలి అనిపించిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. పిల్లల భవిష్యత్తు.. రాష్ట్ర భవిష్యత్త కోసం అందరూ పనిచేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
