Begin typing your search above and press return to search.

నన్ను ఏడుగురు రేప్‌ చేశారు.. వైరల్‌ గా ఇనస్టా పోస్ట్‌!

స్పెయిన్‌ కు చెందిన భార్యాభర్తలు వరల్డ్‌ టూరులో భాగంగా బైకుపై జార్ఖండ్‌ లోని దుమ్కా జిల్లాకు వచ్చారు.

By:  Tupaki Desk   |   4 March 2024 8:33 AM GMT
నన్ను ఏడుగురు రేప్‌ చేశారు.. వైరల్‌ గా ఇనస్టా పోస్ట్‌!
X

కొద్ది రోజుల క్రితం ప్రపంచ టూరులో భాగంగా భారత్‌ లోని జార్ఖండ్‌ కు వచ్చిన స్పెయిన్‌ మహిళపై కొందరు దుండగులు గ్యాంగ్‌ రేప్‌ కు పాల్పడిన సంగతి తెలిసిందే. స్పెయిన్‌ కు చెందిన భార్యాభర్తలు వరల్డ్‌ టూరులో భాగంగా బైకుపై జార్ఖండ్‌ లోని దుమ్కా జిల్లాకు వచ్చారు. అక్కడి నుంచి బీహార్‌ మీదుగా నేపాల్‌ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో దుమ్కాకు చేరుకోగానే చీకటి పడటంతో నిర్మానుష్య ప్రాంతంలో టెంటు వేసుకుని నిద్రకు ఉపక్రమించారు. ఈ సమయంలో దాదాపు పది మంది దుండగులు భర్తను కొట్టి స్పెయిన్‌ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ దారుణ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేశారు. బాధిత మహిళను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది.

కాగా ఈ దారుణ ఘటనకు సంబంధించి బాధిత మహిళ తన ఇనస్టాగ్రామ్‌ ఖాతాలో పెట్టిన పోస్టు వైరల్‌ గా మారింది. ముఖం నిండా గాయాలతో ఉన్న ఆమె ఆ రోజు జరిగిన భయానక ఘటనను ఇనస్టాలో పోస్టు చేశారు.‘‘ఎవరికీ జరగకూడదని మాకు జరిగింది. ఏడుగురు వ్యక్తులు నన్ను రేప్‌ చేశారు’’ అంటూ ఆమె ఆ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. ‘వారు మమ్మల్ని దోచుకున్నారు.. వారు నన్ను రేప్‌ చేయాలని ఆశించారు’ అని బాధతో కూడిన పోస్టును పెట్టారు. దేవుడి దయ వల్లే తామింకా జీవించి ఉన్నామన్నారు.

కాగా ఘటనకు సంబంధించి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి వారి వల్లే దేశ పరువు పోతోందని.. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. జీవితాంతం జైలులోనే ఉంచాలని కోరుతున్నారు. ఇలాంటి తప్పు మరొకరు చేయాలంటే భయపడేలా శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా ఘటనపై దుమ్కా ఎస్పీ పీతాంబర్‌ సింగ్‌ ఖేర్వార్‌ మాట్లాడుతూ.. నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మార్చి 1న రాత్రి 11 గంటల సమయంలో హాన్స్‌ దిహా పోలీస్‌ పెట్రోలింగ్‌ పోలీసులు ఇద్దరు బాధితులను చూశారని వెల్లడించారు. వారితో మాట్లాడాలని ప్రయత్నించగా వారు స్పానిష్‌ లో మాట్లాడటం వల్ల పోలీసులకు ఏం అర్థం కాలేదన్నారు. వారు గాయపడి ఉండటంతో ముందు ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్, సీఐడీ సహాయం తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి మిథిలేష్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ఈ ఘటన దురదృష్టకరమని.. నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.