అంతరిక్షంలో రోజువారీ వ్యోమగామి తిండి ఖర్చు తెలిస్తే అవాక్కే
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలిసారి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా వెళ్లటం తెలిసిందే.
By: Tupaki Desk | 27 Jun 2025 6:00 PM ISTఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలిసారి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా వెళ్లటం తెలిసిందే. ఈ సందర్భంగా అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన అంశాలతో పాటు.. కొత్త ప్రశ్నలు మదిలో మెదిలే పరిస్థితి. ప్రతి మనిషి జీవనానికి అవసరమైన వాటిలో అత్యంత ముఖ్యమైనది ఆహారం. మరి.. ఈ ఫుడ్ విషయానికి వస్తే.. ఒక వ్యోమగామికి రోజుకు అయ్యే తిండి ఖర్చు ఎంత? అన్నది ప్రశ్న.
దీనికి సమాధానం వెతికితే.. కలలో కూడా ఊహించనంత ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుంది తెలుసా? సమాధానం తెలుసుకోవటానికి ముందు.. రోజుకు అయ్యే తిండి ఖర్చును మీకు మీరుగా లెక్కవేసుకోండి. మీరు అనుకున్న మొత్తానికి.. అక్కడయ్యే ఖర్చుకు నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని చెప్పాలి. అంతరిక్షంలోకి ఆహారాన్ని పంపటం అత్యంత ఖరీదైన వ్యవహారంగా చెప్పాలి.
భూమి నుంచి అంతరిక్షానికి ఆహారాన్ని పంపాలంటే ప్రతి కేజీకి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 40 వేల డాలర్లు. మన రూపాయిల్లో చెప్పాలంటే.. దగ్గర దగ్గర రూ.33.6 లక్షలు. ఒక వ్యోమగామి రోజుకు తీసుకోవాల్సిన ఆహారం 1800 గ్రాములు. అంటే.. 1.8 కేజీలు. ఈ మొత్తానికి అయ్యే ఖర్చును మన రూపాయిల్లో చూస్తే ఎంతో తెలుసా? జస్ట్ రూ.60 లక్షల 48వేలు. అంటే..మన శుభాంశు శుక్లా అంతరిక్షంలో ఉండే 15 రోజులకు అయ్యే ఫుడ్ బిల్లు రూ.9.07 కోట్లు.
ఈ కారణంగానే అంతరిక్షంలో ఆహారాన్ని స్వయంగా ఉత్పత్తి చేసేలా ప్రయోగాలు చేస్తున్నారు. అంతరిక్ష కేంద్రానికి ఆహారాన్ని పంపటం.. తినటం చాలా సవాలుతో కూడుకున్న పనులు. అందుకే.. ఈ సమస్యలకు పరిష్కారంగా భారతీయ ఆహార విధానంలో భాగమైన ధాన్యం గింజలు..మొలకలు పరిష్కారం చూపుతాయని భావిస్తున్నారు. భవిష్యత్తులో ధాన్యం గింజల్ని అంతరిక్షంలోనే పండించేలా పరిశోధనలు చేస్తున్నారు.
