Begin typing your search above and press return to search.

జగన్‌ కు ఓటేయొద్దు.. నిన్న కుమార్తె, నేడు తల్లి!

జగన్‌ మాత్రం సాయంత్రం దాకా ఎందుకు సమయం తీసుకున్నారని నిలదీశారు.

By:  Tupaki Desk   |   15 March 2024 6:00 AM GMT
జగన్‌ కు ఓటేయొద్దు.. నిన్న కుమార్తె, నేడు తల్లి!
X

వచ్చే ఎన్నికల్లో జగన్‌ కు ఓటేయొద్దని.. తన కుమార్తె అభిప్రాయంతోపాటు తన అభిప్రాయం కూడా ఇదేనని దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వైఎస్‌ వివేకా హత్య తెల్లవారుజామున జరిగితే సాయంత్రం వరకు జగన్‌ పులివెందులకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తన భర్త మరణవార్త తెలిసి తామంతా ఉదయానికే హైదరాబాద్‌ నుంచి బయలుదేరి పులివెందులకు వచ్చేశామన్నారు. జగన్‌ మాత్రం సాయంత్రం దాకా ఎందుకు సమయం తీసుకున్నారని నిలదీశారు.

జగన్‌ సీఎం అయ్యాక తన కుటుంబమంతా న్యాయం చేయాలని ఆయన వద్దకు వెళ్లామన్నారు. అయితే జగన్‌.. తన కుమార్తె సునీత, అల్లుడిని తప్పుపట్టేలా మాట్లాడారన్నారు. అంతేకాకుండా హంతకులను జగన్‌ అడుగడుగునా కాపాడుతున్నట్టు అనిపిస్తోందని సౌభాగ్యమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె, అల్లుడు హత్యలో ఉన్నారనుకుంటే వాళ్లపైన దర్యాప్తు చేయించి శిక్ష వేయించవచ్చు కదా అని ప్రశ్నించారు.

తమ శత్రువులు ఎక్కడో లేరని.. తమ ఇంట్లోనే ఉన్నారని గ్రహించడానికి తమకు సమయం పట్టిందన్నారు. దీంతో అక్కడి నుంచి వచ్చేసి ఒంటరిగా న్యాయం కోసం పోరాడుతున్నామని తెలిపారు. వాళ్ల దగ్గర అధికారం ఉంది కాబట్టే అవినాష్‌ రెడ్డి తప్పించుకు తిరుగున్నారని ఆరోపించారు.

వివేకా హత్య జరిగి ఐదేళ్లయినా ఇప్పటికీ కేసు దర్యాప్తు పూర్తికాకపోవడం, దోషులకు శిక్ష పడకపోవడం పట్ల సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను రాజకీయ కారణాలతోనే హత్య చేశారని ఆరోపించారు. తన భర్త మృదు స్వభావి, మంచి మనిషి అని తెలిపారు. ఆయనకు లభిస్తున్న ఆదరణను చూసి కొందరు ఓర్చుకోలేకపోయారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భర్తను ఓడించారని.. ఎన్నో ఇబ్బందులు పెట్టి పక్కకు తోసేయాలని భావించారన్నారు.

ఎన్ని విభేదాలున్నా జగన్‌ ను సీఎంను చేయాలని వివేకా తపించారని సౌభాగ్యమ్మ గుర్తు చేశారు. కానీ తమ ఇంట్లోనే శత్రువులున్నారని ఆలస్యంగా గ్రహించామన్నారు. తన కుమార్తె సునీత న్యాయం కోసం ఒంటరి పోరాటం చేస్తుందన్నారు.

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు కోరిన జగన్‌ అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ వద్దన్నారని గుర్తు చేశారు. పైగా నిందితులకు అడుగడుగునా సహకరిస్తూ వస్తున్నారని ఆరోపించారు. తమను పులివెందులలో సమావేశం పెట్టుకోనీయకుండా అడ్డుకున్నారన్నారు. దీంతో తాము కడపలో సమావేశం పెట్టుకున్నామని చెప్పారు. తమకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు.

తన కుమార్తె సునీత తన తండ్రికి కారకులెవరో తేల్చాలని పట్టుబట్టడంతో నేరాన్ని చివరకు ఆమెపైన, ఆమె భర్తపైన వేసేందుకు తెగించారని సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తమకు న్యాయం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి రాజకీయ ప్రవేశంపై ఏం నిర్ణయించుకోలేదని.. సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని సౌభాగ్యమ్మ వెల్లడించారు.

ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఇదేం పరిపాలన అని బాధపడ్డానని సౌభాగ్యమ్మ తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత అయినా రాష్ట్రానికి మంచి పరిపాలకుడు రావాలని ఆకాంక్షించారు. ప్రజలకు మంచి పరిపాలన అందించే ప్రభుత్వం రావాలన్నారు.