Begin typing your search above and press return to search.

సొరంగంలోని వరదలో చిక్కుకున్న బస్సు... 7గురు మృతి!

అవును... దక్షిణ కొరియాలోని చెంగ్జూలోని నాలుగు లైన్ల రహదారి కింద ఉన్న గంగ్‌ ప్యోంగ్‌ సొరంగంలోకి వరద నీరు ప్రవేశించిందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   16 July 2023 10:56 AM GMT
సొరంగంలోని వరదలో చిక్కుకున్న బస్సు... 7గురు మృతి!
X

ప్రస్తుతం భారతదేశంలో మరి ముఖ్యంగా ఉత్తరాధిలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అవిరామంగా కురుసున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో వేలాది కుటుంబాలు వరదల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న పరిస్థితి.

ఇదే సమయంలో విదేశాల్లో కూడా వర్షాలకు వాగులూ వంకలూ పొంగిపొర్లుతున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా... దక్షిణ కొరియాలో భారీ వర్షాల కారణంగా వరదలు ఓ సొరంగంలోకి ప్రవేశించాయి. ఈ మార్గంలో కనీసం 15 వాహనాలు ఉన్నాయని.. ప్రస్తుతం అవి మొత్తం నీటిలో మునిగిపోయాయని అధికారులు చెబుతున్నారని అంటున్నారు.

అవును... దక్షిణ కొరియాలోని చెంగ్జూలోని నాలుగు లైన్ల రహదారి కింద ఉన్న గంగ్‌ ప్యోంగ్‌ సొరంగంలోకి వరద నీరు ప్రవేశించిందని తెలుస్తుంది. దీంతో ఆ సొరంగంలో 12 కార్లు, ఒక బస్సు సహా సుమారు 15 వాహనాలు చిక్కుకుపోయాయని అంటున్నారు. ఈ క్రమంలో సొరంగంలో బస్సు నుంచి ఏడు మృతదేహాలను వెలికితీశారని అంటున్నారు.

ఇలా ఉన్నఫలంగా చుట్టుముట్టిన ఈ మెరుపు వరదల్లో చిక్కుకున్నవారి సహాయ చర్యలకోసం 400 మంది సహాయ బృందాలను మొహరించారని అంటున్నారు. ఈ సొరంగం పొడవు సుమారు 685 మీటర్లు అని తెలుస్తుంది. దీంతో సొరంగంలో చిక్కుకొన్నవారి వద్దకు వెళ్లడం అధికారులకు కష్టంగా మారిందని తెలుస్తుంది.

కాగా... దక్షిణ కొరియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటు చేసుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 26 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించగా... అందులో ఒక్క ఉత్తర జియోంగ్‌ సాంగ్‌ ప్రావిన్స్‌ లోనే 16 మరణాలు సంభవించాయని సమాచారం.