Begin typing your search above and press return to search.

బిడ్డను కనండి.. రూ.62 లక్షలుపొందండి!

ఈ సమయంలో దక్షిణ కొరియాకు చెందిన ఓ నిర్మాణ సంస్థ "బూయోంగ్ గ్రూప్" సరికొత్త ఆలోచన చేసింది

By:  Tupaki Desk   |   9 Feb 2024 2:14 PM GMT
బిడ్డను కనండి.. రూ.62 లక్షలుపొందండి!
X

ఒకప్పుడు పిల్లలే ఆస్తులు అనుకునేవారు.. అనంతరం కాలంలో పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేయడం కోసం ఇద్దరు ముద్దు అంతకు మించి వద్దు అనేవారు! తర్వాతి కాలంలో ఒక్కరు ముద్దు, ఇద్దరు వద్దు అనేవరకూ వచ్చింది!! ప్రస్తుతం ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెబుతున్నారు!! ఆ సంగతి అలా ఉంటే... ఇప్పటి జనరేషన్ మాత్రం పిల్లలు వద్దు.. ఇలానే ముద్దు అని కేవలం భార్యా భర్తలుగానే ఉంటున్నారు తప్ప తల్లితండ్రులుగా మారడం లేదనే చర్చ పెరిగిపోతుంది.

అవును... ఒకప్పుడు గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం అనేవారు. ఇప్పుడు మాత్రం అసలు అలాంటి బహుమానం తమకు వద్దంటూ మొడికేస్తున్నారంట కొంతమంది దంపతులు. దీంతో ఈ విషయంపై ఇప్పటికే చైనా దేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బిడ్డలకు కనే దంపతులులకు రకరకాల బెనిఫిట్స్ కల్పిస్తుంది. అయినా కూడా అక్కడి యువత ప్రభుత్వం చెబుతున్న మాటలను పట్టించుకోవడం లేదని అంటున్నారు.

ఈ సమయంలో దక్షిణ కొరియాకు చెందిన ఓ నిర్మాణ సంస్థ "బూయోంగ్ గ్రూప్" సరికొత్త ఆలోచన చేసింది. ఇందులో భాగంగా ఉద్యోగులకు బిడ్డ పుట్టిన ప్రతిసారీ 100 మిలియన్ కొరియన్ వాన్ లేదా రూ. 62.3 లక్షలు చెల్లిస్తామని తెలిపింది. ఈ క్రమంలో 2021 నుండి 70 మంది శిశువులను కలిగి ఉన్న ఉద్యోగులకు మొత్తం 7 బిలియన్ కొరియన్ వోన్ (రూ. 43.65 కోట్లు) నగదును కూడా చెల్లిస్తుందట! తమ సంస్థలో పనిచేస్తున్న పురుష, మహిళ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని చెబుతున్నారు.

మరోపక్క సింగపూర్ ప్రభుత్వం కూడా పిల్లల్ని కనేలా యువ జంటలను ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా... ఆ దేశ ప్రధానమంత్రి లీ సీన్‌ లూంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా నూతన సంవత్సరం సందర్భంగా.. ఆ దేశ మూలాలున్న ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ సందేశం ఇచ్చారు. ఈ క్రమంలో... యువ జంటలు తమ తమ కుటుంబంలోకి చిట్టి డ్రాగన్‌ ను ఆహ్వానించడానికి ఇది మంచి సమయం అని అన్నారు.

కాగా... ఫిబ్రవరి 10న చైనా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. రాశుల ప్రకారం ఇది వారికి డ్రాగన్‌ ఇయర్‌. పైగా... ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇది వస్తుందట. ఈ నేపథ్యంలో... చైనా మూలాలు ఉన్న కుటుంబాలు డ్రాగన్‌ నామ సంవత్సరంలో జన్మించిన పిల్లలను అదృష్టంగా భావిస్తుంటారని చెబుతుంటారు. ఈ విషయాన్నే లీ సీన్‌ లూంగ్ తన సందేశంలో ప్రస్తావించారు. ఇదే సరైన సమయం అని చెప్పుకొచ్చారు!