దక్షిణాఫ్రికాలో రాజకీయ అనిశ్చితికి తెర.. దేశాధ్యక్షుడిగా పారిశుద్ధ్య కార్మికుడి కొడుకు
దక్షిణ కొరియాలో దాదాపు ఆరు నెలల రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ లీ జే-మ్యూంగ్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు.
By: Tupaki Desk | 5 Jun 2025 1:37 PM ISTదక్షిణ కొరియాలో దాదాపు ఆరు నెలల రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ లీ జే-మ్యూంగ్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. గత డిసెంబర్‌లో అప్పటి అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తర్వాత దేశం రాజకీయ గందరగోళంలో కూరుకుపోయింది. అనంతరం యూన్‌పై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందింది. రాజ్యాంగ న్యాయస్థానం ఓటును ధృవీకరించడానికి సమయం తీసుకోవడంతో ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అయింది. అయితే, చివరకు దక్షిణ కొరియా ప్రజలు తమ తీర్పును వెల్లడించారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన 61 ఏళ్ల లీని తమ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పాలక పీపుల్స్ పవర్ పార్టీకి చెందిన కిమ్ మూన్-సూను ఓడించి.. ప్రజాస్వామ్యాన్ని బెదిరించే శక్తులకు తాము మద్దతు ఇచ్చేదేలేని స్పష్టం చేశారు.
1963లో పేద కుటుంబంలో జన్మించిన లీ జే-మ్యూంగ్, బాల కార్మికుడిగా పనిచేస్తూనే తన విద్యను కొనసాగించారు. 1982లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986లో బార్ పరీక్షలో ఉత్తీర్ణులై న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. పేదలు, కార్మికుల తరపున అనేక కేసులలో పోరాడిన మానవ హక్కుల న్యాయవాదిగా ఆయనకు మంచి పేరుంది. లీ 2005లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రారంభంలో కొన్ని ఎదురుదెబ్బలు తగిలినా, తర్వాత మేయర్‌గా, గవర్నర్‌గా ఎన్నికై పాలనలో తన కెపాసిటీ ఏంటో నిరూపించుకున్నారు. 2022 అధ్యక్ష ఎన్నికలలో లీ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, పీపుల్స్ పవర్ పార్టీ అభ్యర్థి యూన్ సుక్-యోల్ చేతిలో కేవలం 0.73 శాతం ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
లీ జే-మ్యూంగ్‌పై పలు కేసులు కూడా నమోదయ్యాయి. వాటిలో కొన్ని తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. ఆయన అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేస్తున్న సమయంలో న్యాయస్థానాలు ఈ కేసుల విచారణను నిలిపివేశాయి. అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ఈ కేసులు ముందుకు సాగకపోవచ్చు. ఈ విషయంలో దక్షిణ కొరియా అధ్యక్షుడికి చట్టపరమైన మినహాయింపు ఉంటుంది. 2024లో లీపై హత్యాయత్నం కూడా జరిగింది. ఒక వ్యక్తి ఆటోగ్రాఫ్ అడుగుతూ ఆయన మెడకు తీవ్ర గాయం చేశాడు. వైద్యులు దాదాపు రెండు గంటల పాటు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. లీపై మద్యం తాగి వాహనం నడిపిన కేసు కూడా నమోదైంది. 2018లో ఆయనపై వివాహేతర సంబంధం ఆరోపణలు కూడా వచ్చాయి. 2022 ఎన్నికల కేసులో కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించింది. తర్వాత అప్పీల్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించినా సుప్రీంకోర్టు ఆ తీర్పును తిరస్కరించింది.
లీ జే-మ్యూంగ్ రెండు కొరియాలు తిరిగి కలవాలన్న బలమైన ఆకాంక్ష ఉన్న వ్యక్తి. ఉత్తర కొరియాతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడం ఆయన విధానం. ఇది గత యూన్ సుక్-యోల్ ప్రభుత్వ విధానానికి పూర్తిగా భిన్నం. ఈ విషయంలో లీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉండటం మంచి పరిణామం. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చలు జరిపారు. కాబట్టి, లీ విధానానికి అగ్రరాజ్యం నుంచి పెద్దగా వ్యతిరేకత ఎదురుకాకపోవచ్చు. అయితే, అమెరికా విధించిన ఆర్థిక సుంకాలు రాబోయే రోజుల్లో దక్షిణ కొరియాను తీవ్ర సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లీ అధ్యక్ష ప్రయాణం అంత సులువుగా కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
