Begin typing your search above and press return to search.

తేలిన తల్లీ కూతుళ్ల లెక్క!

లోక్ సభ ఎన్నికలకు ముందు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఏఐసీసీ.. సోనియాను రాజ్యసభకు పంపాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 4:37 AM GMT
తేలిన తల్లీ కూతుళ్ల లెక్క!
X

పెరిగిన వయసు.. అంతకంతకూ తగ్గుతున్న ఆరోగ్యం.. తరచూ ఇబ్బంది పెడుతున్న అనారోగ్యం నేపథ్యంలో ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియాగాంధీ సిద్ధమయ్యారు. తాజాగా ఆమెను రాజ్యసభకు పంపేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీని కుమార్తె ప్రియాంకకు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

లోక్ సభ ఎన్నికలకు ముందు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఏఐసీసీ.. సోనియాను రాజ్యసభకు పంపాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ దిశగా పావులు కదుపుతోంది. ఇటీవల కాలంలో తెలంగాణలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి సోనియమ్మ బరిలోకి దిగాలని కాంగ్రెస్ నేతలు పలువురు కోరుతున్న వేళ.. అసలు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు సోనియా సుముఖంగా లేరన్న విషయం తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇటీవల సోనియాను కలిసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రతిపాదనపై సోనియా పెద్ద ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో తరచూ అనారోగ్యం బారిన పడుతున్న ఆమె.. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను ఎంపీగా వ్యవహరిస్తున్న రాయ్ బరేలీ స్థానం నుంచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంకను అభ్యర్థిగా బరిలోకి దించాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ప్రియాంక బరిలో ఉంటే కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలకు అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో సోనియాను రాజ్యసభకు పంపటం ద్వారా.. ఆమెను అనవసరమైన ఒత్తిళ్ల నుంచి కాస్త దూరం చేసినట్లు అవుతుందన్న వాదన వినిపిస్తోంది. సోనియమ్మను ఏదోలా తెలంగాణ నుంచి పోటీ చేయాలన్న తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆశలు.. తాజా సమాచారంతో ఆడియాశలు అయినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ అధినాయకత్వంలోని కీలకమైన తల్లీ కూతుళ్ల సీట్ల లెక్కలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెప్పక తప్పదు.