సోనియా, రాహుల్ ల ఆస్తుల స్వాధీనం.. షాక్ ఇచ్చిన ఈడీ
యంగ్ ఇండియా, ఏజేఎల్‌ను కొనుగోలు చేయడంలో ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగాయని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది.
By: Tupaki Desk | 12 April 2025 6:16 PM ISTకాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరికి సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఈడీ ప్రారంభించింది. త్వరలోనే సోనియా, రాహుల్ ఆస్తులను ఈడీ అధికారికంగా స్వాధీనం చేసుకోనుంది.
యంగ్ ఇండియన్ సంస్థలో వాటాదారులుగా ఉన్న సోనియా, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికను గతంలో నడిపిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను స్వాధీనం చేసుకునే క్రమంలో భారీగా నగదు లావాదేవీలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఏజేఎల్ యజమానులకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. యంగ్ ఇండియా, ఏజేఎల్‌ను కొనుగోలు చేయడంలో ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగాయని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది.
ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సుబ్రమణ్యస్వామి గతంలో మాట్లాడుతూ, యంగ్ ఇండియన్ సంస్థ ఏకంగా రూ.2,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను నియంత్రించేందుకు ఏజేఎల్‌ను దురుద్దేశపూర్వకంగా స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. ఈ ఆరోపణల ఆధారంగానే ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా ఏజేఎల్ ఆస్తులకు సంబంధించిన రూ.988 కోట్ల నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనీలాండరింగ్ చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో 2023లోనే ఈడీ అటాచ్‌మెంట్ ప్రక్రియను మొదలుపెట్టింది. తాజాగా ఈ అటాచ్‌మెంట్‌ను ఈడీ ధృవీకరించింది.
దీంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈడీ చర్యలపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
