అభిషేక్ పై దాడి ఎపిసోడ్ : బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ఛేంజ్?
ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో జరిగిన దాడితో రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయనే విశ్లేషణలు వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Political Desk | 1 Jun 2026 7:00 PM ISTపశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వేడి చల్లారడం లేదు. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో జరిగిన దాడితో రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయనే విశ్లేషణలు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తీవ్ర నైరాశ్యంలో ఉన్న టీఎంసీ శ్రేణులకు ఈ ఘటన ఒక కొత్త అస్త్రాన్ని అందించిందని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ దాడిని 1990లో మమతా బెనర్జీపై జరిగిన ప్రాణాంతక దాడితో పోలుస్తుండటంతో పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ కొనసాగుతోంది. అయితే, 1990 నాటి పరిస్థితులకు, ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉందంటున్నారు విశ్లేషకులు. అయినప్పటికీ, దెబ్బతిన్న టీఎంసీని మళ్లీ లైన్లోకి తెచ్చేందుకు ఈ ఘటన ఉపయోగపడే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
1990లో ఏం జరిగింది?
1990 ఆగస్టు 16న కోల్‌కతాలోని హజ్రా క్రాసింగ్‌లో అప్పటి సీపీఐ(ఎం) యువజన విభాగం శ్రేణులు మమతా బెనర్జీపై లాఠీలతో ఘోరంగా దాడి చేశారని పరిశీలకులు చెబుతున్నారు. ఆ దాడిలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. నెల రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన మమత, కోలుకున్నాక ఆ గాయాలనే తన రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారని గుర్తు చేస్తున్నారు. తలకు తెల్లటి బ్యాండేజ్‌తోనే ఆమె ప్రజల్లోకి వెళ్లారు. ఆ విజువల్స్ బెంగాల్ ప్రజల్లో విపరీతమైన సానుభూతిని తెచ్చిపెట్టాయి.ఇక అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం తనకు అండగా నిలబడలేదని భావించిన మమత, ఆ కసితోనే 1998లో తృణమూల్ కాంగ్రెస్ స్థాపించి బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్ కోటను బద్దలు కొట్టారని అంటున్నారు.
కేవలం 1990 మాత్రమే కాదు, 2021 ఎన్నికల సమయంలో కాలికి గాయమైనా వీల్‌చైర్‌లోనే ప్రచారం చేసి మమత విజయం సాధించారు. ఈ పరిణామాలతో రాజకీయ దాడులను సానుభూతిగా మార్చుకోవడంలో దీదీది ప్రత్యేక శైలి అనుసరిస్తారని చెబుతున్నారు. కాగా, ఇప్పుడు అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో గుడ్లు, రాళ్లు, చెప్పులతో దాడి జరిగిందని అంటున్నారు. అయితే ఆయన క్రికెట్ హెల్మెట్ ధరించి ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. కానీ, మమతా బెనర్జీ నాటి పోరాటానికి, నేటి అభిషేక్ పరిస్థితికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
1990లో మమతా బెనర్జీ ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, క్షేత్రస్థాయి నుంచి ఒంటరిగా పోరాడి పైకొచ్చిన లీడర్. దీంతో ఆమెపై జరిగిన దాడిపై సానుభూతి వచ్చిందని అంటున్నారు. కానీ అభిషేక్ బెనర్జీ అలా కాదని, ఆయన మమత మేనల్లుడు కావడం వల్ల పార్టీలో నంబర్-2 స్థానం నేరుగా లభించిందని చెబుతున్నారు. నాటి కాలంలో అధికార పక్షం (లెఫ్ట్) పై వ్యతిరేకత ఉండేదని, కానీ ఇప్పుడు టీఎంసీపై 15 ఏళ్ల యాంటీ-ఇంకంబెన్సీ ఉండటంతో నాటి ఘటనకు ప్రస్తుత దాడికి ఎటువంటి సారూప్యత లేదని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా సోనార్‌పూర్‌లో దాడి జరిగినప్పుడు జనం "దొంగ, దొంగ" అని నినాదాలు చేయడం చూస్తే అభిషేక్ బెనర్జీపై వారికి ఎలాంటి సానుభూతి లేదని అర్థమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని ఆసరగా చేసుకున్న అధికార పక్షం, అభిషేక్ పై దాడిని రాజకీయ కుట్ర కంటే కూడా స్థానిక ప్రజల ఆగ్రహంగా చూపే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు.
అయితే, ఈ సంక్షోభ సమయాన్ని కూడా మమతా బెనర్జీ తనదైన శైలిలో అనుకూలంగా మార్చుకునేందుకు 3 వ్యూహాలను సిద్ధం చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా ఓటమితో జాతీయ స్థాయిలో ఒంటరి అయినట్లు కనిపించిన మమత తిరిగి పుంజుకునే ప్రయత్నం మొదలుపెట్టారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వెంటనే స్పందిస్తూ, అభిషేక్ పై దాడిని కక్ష సాధింపు రాజకీయంగా ఖండించారని చెబుతున్నారు.
మరోవైపు పాలక బీజేపీ ప్రభుత్వాన్ని ఆదిలోనే దెబ్బతీసేందుకు మమత ఈ దాడిని ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు. ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శిని చంపే కుట్రలో భాగంగానే భద్రతా సిబ్బందిని తగ్గించేశారని, పాలకులే హంతకులుగా మారారని మమత ఘాటైన విమర్శలతో విరుచుకుపడటం కూడా బెంగాలీలను ఆలోచనకు గురిచేస్తోందని అంటున్నారు. ఇలా ప్రచారం చేయడం ద్వారా ఎన్నికల్లో ప్రజల ఆగ్రహంతో ఎదురైన ఓటమి నుంచి వీలైనంత త్వరగా బయటపడొచ్చని మమత వ్యూహంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
ఇక తాజా పరిణామాల ద్వారా ఎన్నికల ఓటమితో నైరాశ్యంలో ఉన్న టీఎంసీ శ్రేణులను రోడ్డుపైకి తెచ్చేందుకు ఇదొక పెద్ద అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా అంటున్నారు. బెంగాల్ వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు చేపట్టడం ద్వారా క్షేత్రస్థాయి కార్యకర్తల్లో మళ్లీ జోష్ నింపేందుకు పార్టీ ఈ అవకాశాన్ని వాడుకుంటోందని చెబుతున్నారు. మొత్తానికి అభిషేక్ బెనర్జీపై దాడిని రాజకీయంగా వాడుకునేలా మమత పక్కా వ్యూహంతో పనిచేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.
