అప్పటి వరకు బతికే ఉంటా.. తర్వాత ఆత్మనై పోరాడతా.. ఎవరీయన? విషయం ఏంటి?
దేశంలో నిరసన ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. కొన్ని వెలుగులోకి వచ్చినంతగా మరికొన్నిరావడం లేదు. ఇలాంటి నిరసన ఉద్యమమే.. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమం.
By: Garuda Media | 17 July 2026 11:08 PM ISTదేశంలో నిరసన ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. కొన్ని వెలుగులోకి వచ్చినంతగా మరికొన్నిరావడం లేదు. ఇలాంటి నిరసన ఉద్యమమే.. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమం. వైద్య విద్య ప్రవేశాల కోసం మేలో నిర్వహించిన నీట్ పేపర్ లీక్ కావడం.. అవకతవకలు వెలుగు చూడడంతో దేశవ్యాప్తంగా ఏడుగురు విద్యార్థులుఆత్మహత్యలు చేసుకున్నారు. ఆతర్వాత దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం పెను కలకలం సృష్టించింది. ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా హైదరాబాద్ వంటి కీలక నగరాల్లో నిరసన చేపట్టింది.
ప్రధానంగా నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ నిరసన ఆగిపోయినా.. ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన జమ్ము కశ్మీర్‌లోని లద్ధఖ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్(60) మాత్రం తన నిరసనను కొనసాగిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి ఆది నుంచి మద్దతు తెలుపుతున్న ఆయన హైదరాబాద్‌లో నిర్వహించిన నిరసనకు కూడా వచ్చారు.
అనంతరం.. జంతర్ మంతర్ వద్దే.. సోనమ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేంద్ర మంత్రి రాజీనామాతోపాటు... ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నది ఆయన డిమాండ్. ఈ క్రమంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం(జూలై 17)తో 20 రోజులు నిండాయి. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు కూడాచెబుతున్నారు. అయితే.. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంకానీ, ఢిల్లీ ప్రభుత్వం కానీ స్పందించలేదు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు ఈ వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. వైద్యులు సోనమ్‌కు సేవలు అందించేలా చూడాలని, ఆయన ప్రాణాలకు ఎలాంటి ముప్పురాకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉంటుందని పేర్కొంది.
అయినప్పటికీ.. కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలావుంటే.. తాజాగా శనివారం సోనమ్ స్పందించారు. తాను మరో మూడు రోజుల వరకు జీవించే ఉంటానన్న నమ్మకం ఉందన్నారు. శారీరకంగా తాను నీరసపడుతున్నా.. మానసికంగా బలంగానే ఉన్నానని తెలిపారు. తన ఉద్యమం నెరవేరి తీరుతుందని చెప్పారు. అంతేకాదు.. పార్లమెంటు వర్షాకాల ప్రారంభం రోజు(సోమవారం-జూలై 20) మార్చ్ నిర్వహించాలని తలపెట్టిన కాక్రోచ్ పార్టీకి తన మద్దతు ఉంటుందని.. మార్చ్‌లో తాను పాల్గొంటానని చెప్పారు. ఒక వేళ ఏదైనా జరిగి, తన ప్రాణాలు పోయినా.. ఆత్మనై తిరిగి వచ్చి పోరాటాన్నికొనసాగిస్తానని చెప్పడం గమనార్హం. మరోవైపు.. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. మరి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో చూడాలి.
