Begin typing your search above and press return to search.

సోము పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనా ...!?

ఆయనకు తాజాగా బీజేపీ విడుదల చేసిన ఎమ్మెల్యే జాబితాలో చోటు లేదు. దానికంటే ముందు ఎంపీ జాబితాలోనూ ఆయన పేరు లేదు

By:  Tupaki Desk   |   28 March 2024 5:18 AM GMT
సోము పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనా  ...!?
X

బీజేపీతో నాలుగున్నర దశాబ్దాల అనుభవం కలిగిన సీనియర్ నేత ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ అయిన సోము వీర్రాజు పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనా అన్న చర్చ సాగుతోంది. ఆయనకు తాజాగా బీజేపీ విడుదల చేసిన ఎమ్మెల్యే జాబితాలో చోటు లేదు. దానికంటే ముందు ఎంపీ జాబితాలోనూ ఆయన పేరు లేదు.

నిజానికి సోము వీర్రాజు ఈసారి రాజమండ్రి నుంచి ఈసారి ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. కానీ ఎంపీ సీటు కాస్తా పురంధేశ్వరికి వెళ్ళింది. రాజమండ్రి అర్బన్ రూరల్ లలో ఏదో ఒక అసెంబ్లీ సీటు అయినా దక్కుతుందంటే అది టీడీపీ తీసుకుంది. దాంతో సోము వీర్రాజుకు ఇపుడు రాజకీయంగా అడుగు ముందుకు వేసే పరిస్థితి కనిపించడం లేదు అని అంటున్నారు.

సోము వీర్రాజు 1980లో బీజేపీ యువ మోర్చా తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన కెరీర్ ప్రారంభించారు. ఆయన అలా బీజేపీలో అనేక పదవులు అందుకున్నారు. అయితే ఇంతటి సీనియర్ నేత కేంద్రంలోని బీజేపీ అగ్ర నేతలకు సన్నిహితుడిగా పేరున్న సోము వీర్రాజుకు ఈసారి పోటీ చేయకపోవడానికి అవకాశం రాకపోవడం పట్ల మాత్రం చర్చ సాగుతోంది.

ఇదిలా ఉంటే బీజేపీలో వలస నాయకులకే టికెట్లు దక్కాయని అంటున్నారు. దాంతో పాటుగా మొదటి నుంచి ఉన్న వారిని వెనక్కి నెట్టేశారు అని అంటున్నారు. సుజనా చౌదరి వంటి వారికి టికెట్లు దక్కాయి. అలాగే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట నుంచి ఎంపీగా చాన్స్ ఇచ్చారు. అనకాపల్లి ఎంపీ సీటుని సీఎం రమేష్ కి ఇచ్చారు.

పార్టీలో టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్న వారికి టికెట్లు దక్కాయని అదే విధంగా ఏపీ బీజేపీ సొంతంగా ఎదగాలని కోరుకునే వారిని పక్కన పెట్టారు అని అంటున్నారు. ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలను ఆ పార్టీ అగ్ర నాయకులకు కొంతమంది సీనియర్లు లేఖ రూపంలో రాశారు. అది జరిగిన తరువాత సీనియర్లకు పూర్తిగా టికెట్లు ఇవ్వలేదంటే హై కమాండ్ ఆలోచనలు ఏమిటో అర్ధం కావడం లేదు అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే హై కమాండ్ తలచుకుంటే ఇప్పటికీ సోము వీర్రాజుకు పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన విషయంలో మరో ప్రచారం కూడా వినిపిస్తోంది. కాకినాడ ఎంపీ సీటు నుంచి ఆయనను పోటీ చేయిస్తారు అని. ఇది ఎంతవరకూ సాధ్యమో తెలియడంలేదు. ఎందుచతనటే ఈ సీటు జనసేనకు ఇచ్చేశారు.

ఆ పార్టీ కూడా టీ టైం ఉదయ్ శ్రీనివాస్ కి ఈ ఎంపీ టికెట్ ని ప్రకటించింది. ఇప్పటికే జనసేనకు ఇచ్చిన మూడు ఎంపీ సీట్లలో ఒకటి తీసుకున్నారు. ఇపుడు మరొకటి తీసుకుంటారా అలా జరిగితే జనసేన ఊరుకుంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మరో వైపు చూస్తే అనపర్తి అసెంబ్లీ సీటు సోము వీర్రాజుకు కేటాయించారు కానీ ఆయన కోరి తిరస్కరించారు అని అంటున్నారు.

ఆ సీటులో పోటీ చేసినా మానేసినా ఒక్కటే అని ఆయన భావించారు అని అంటున్నారు. అనపర్తిలో బీజేపీకి పెద్దగా బలం లేదు. టీడీపీ సపోర్ట్ చేయకపోతే ఘోర ఓటమిని ఆయన మూటకట్టుకుంటారు అని తెలిసే ముందుగానే ఆ పరాభావాన్ని తప్పించుకున్నారు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే ఒక్క సోముకే కాదు విశాఖకు చెందిన మరో సీనియర్ నేత పీవీఎన్ మాధవ్ కి కూడా సీటు లేకుండా పోయింది. ఆయనకు కూడా అనకాపల్లి ఎంపీ అన్నారు, విజయనగరం ఎంపీ సీటు ఇస్తామని అన్నారు. కానీ చివరికి చెక్ పెట్టేసారు అని అంటున్నారు. బీసీ నేతగా ఉన్న మాధవ్ కి కూడా టికెట్ ఇవ్వకపోవడం పట్ల పార్టీలో చర్చగా ఉంది.

అదే విధంగా విష్ణు వర్ధన్ రెడ్డికి కూడా టికెట్ దక్కలేది. ఆయన అనంతపురం కదిరికి చెందిన వారు పొత్తులో భాగంగా ఆ సీటు ఆశించారు. దాన్ని టీడీపీ ఉంచేసుకుంది. ఇక అనంతపురం జిల్లాలో బీజేపీ ఒక అసెంబ్లీ సీటు తీసుకుంది. దాన్ని పార్టీలో మరో కీలక నేత వై సత్యకుమార్ కి ఇచ్చింది. ఇక పరిపూర్ణానంద స్వామి కూడా హిందూపురం ఎంపీ టికెట్ ఆశించారు.

అయితే ఆయనకు లేదు అనిపించేశారు. ఇలా సీనియర్లు పార్టీ కోసం మొదటి నుంచి ఉన్న వారికి టికెట్లు రాకపోవడం పట్ల కమలం పార్టీలో సెగలూ పొగలూ రేగుతున్నాయి. దీని మీద ఆ పార్టీ సీనియర్ నేత ఐవైఆర్ క్రిష్ణా రావు మాట్లాడుతూ టీడీపీ అభ్యర్ధులను ఎంపిక చేసిన తరువాత బీజేపీ ప్రకటించిందా అంటూ తన డౌట్ ని ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు.