Begin typing your search above and press return to search.

అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకో?

ఈ నేపథ్యంలో ఎదుటి వారితో పోల్చుకోవడం, మనల్ని మనం తగ్గించుకోవడం, కించపరుచుకోవడం, తమ జన్మే వ్యర్థం అని భావించడం, ఆత్మన్యూనతకు గురికావడం వంటివి అసలే చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 Oct 2023 10:21 AM GMT
అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకో?
X

ఇప్పుడంతా ఉరుకుల పరుగుల జీవితం. ఒక ఇంట్లో భార్యాభర్త ఇద్దరూ పనో, ఉద్యోగమో చేస్తే కానీ అవసరాలు తీరడం లేదు. పిల్లలు, సంసారం, ఇంటి పనులు, మరోవైపు ఉద్యోగ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు.. ఇలా లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అంతా ఒకటే పని. ఇక ఉద్యోగులు అయితే పని ఒత్తిడితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాలు విధించే టార్గెట్లు, లక్ష్యాలు అందుకోవడానికి తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

ఈ ఒత్తిడితో దాదాపు అంతా చిత్తవుతున్నారు. దీనివల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. ఇక విద్యార్థులు పరీక్షలో విఫలమైనా, ప్రేమలో విఫలమైనా, అనుకున్న ఉద్యోగం రాకపోయినా ఇలా చిన్న చిన్న కారణాలకు మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా మానసిక ఒత్తిడికి గురై బాధపడేవారికి సకాలంలో కుటుంబ సభ్యులో, స్నేహితులో కౌన్సెలింగ్‌ ఇవ్వకపోతే జరిగే అనర్థాలు అన్నీఇన్నీకావు.

శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మానసికంగా ఆరోగ్యంగా ఉండాల్సిందే. మానసికంగా ఏ రుగ్మతలు లేకపోతేనే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఎదుటి వారితో పోల్చుకోవడం, మనల్ని మనం తగ్గించుకోవడం, కించపరుచుకోవడం, తమ జన్మే వ్యర్థం అని భావించడం, ఆత్మన్యూనతకు గురికావడం వంటివి అసలే చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

అక్టోబర్‌ 10న వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌ డేని పురస్కరించుకుని మానసిక వైద్య నిపుణులు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ముందుగా కెరీర్‌ పరంగా లేదా ఆర్థిక పరంగానో,కుటుంబ పరంగానో మీరు ఉన్నతంగా లేదా మంచి స్థాయిలో లేకపోయామనే నిరాశ ఉంటే.. దాన్ని వెంటనే మనసులోంచి తీసేయాలని చెబుతున్నారు. అందరూ అన్నీ సాధించలేకపోవచ్చని.. ఎవరి ప్రత్యేకత వారిదే అది గుర్తించాలని సూచిస్తున్నారు.

ముఖ్యంగా కోల్పోయినవి, సాధించలేనివి తలుచుకుని.. వాటితో తక్కువ చేసుకుని ఆత్యనూన్యతకు గురై బాధపడటం మానేయాలని అంటున్నారు. ఎవరి ప్రత్యేకతలు వారికుంటాయని మానసిక వైద్య నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదట మీరు సాధించిన చిన్న చిన్న విజయాలు గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నారు. మీరు ప్రయత్నించి సాధించలేకపోయినా కొంత అయినా సాధించామని సంతోషపడమంటున్నారు.

పరాజయం పెద్దదైన చిన్నదైనా ఐ డోంటే కేర్‌ అనే పదాన్ని సర్మించుకోవాలంటున్నారు. అది అన్నింటికీ అసలైన మందని చెబుతున్నారు. ఏ రోజుకైన ఎప్పటికైనా మీకంటూ ఓ రోజు వస్తుందనే ఆత్మవిశ్వాసంతో ఉండాలంటున్నారు. ఆ రోజు మీరు సాధించగలుగుతారని గట్టిగా నమ్మాలంటున్నారు. ఇలా అనుకుంటే ఎలాంటి మానసిక వ్యాధైనా పారిపోతుందని చెబుతున్నారు.

జీవితం సాఫీగా సాగితే గొప్పదనం ఉండదని.. ఆటుపోట్లు ఉంటేనా మంచి కిక్కు ఉంటుందని అంటున్నారు. అదే మీ గొప్పతనాన్ని బయటపెట్టుకునే ఓ గొప్ప అవకాశమని చెబుతున్నారు. కాబట్టి మనసును పట్టిపీడించే చింతను చిత్తుచేసి మానసికంగా ధృడంలా ఉండేలా మనసుకి శిక్షణ ఇవ్వాలంటున్నారు. అప్పుడే సులభంగా మానసిక అనారోగ్యం నుంచి బయటపడగలుగుతారని పేర్కొంటున్నారు.

ఫోన్లకు దూరంగా ఉండి స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపటం, వారికి సమయం కేటాయించడం, మంచి పుస్తకాలు చదువుకోవడం, సంగీతం వినడం, నిత్యం వాకింగ్, జాగింగ్, తగినంత నిద్ర, మంచి పౌష్టికాహారం తీసుకుంటే మానసిక అనారోగ్యానికి దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు తేల్చిచెబుతున్నారు.