సోమిరెడ్డి లాజిక్ మిస్సయ్యారు.. బూమరాంగ్..!
అయితే.. తాజాగా సోమిరెడ్డి లాజిక్ ఎక్కడో మిస్సయ్యారు. దీంతో ఆయన వ్యాఖ్యలు బూమరాంగ్ అయి.. నెటిజన్ల నుంచే కాకుండా.. టీడీపీ నేతల నుంచికూడా పెదవి విరుపులు కనిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 15 April 2025 1:18 PMటీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాజకీయాల్లో తలపండిన నాయ కుడు. ఓటమి మూటగట్టుకున్నా.. వెంటబడుతున్నా.. పోరాడి విజయందక్కించుకుని 2024 ఎన్నికల్లో సర్వేపల్లిలో సర్రున పైకి లేచాడు. ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా స్ట్రయిట్‌గా మాట్లాడే లక్షణం సొంతం. సోది ఉండదు. సుత్తి కూడా ఉండదు. అలాగని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడాచేయరు. ఎదుటివారిని నొప్పించే బూతులు అసలే అనరు.
అయితే.. తాజాగా సోమిరెడ్డి లాజిక్ ఎక్కడో మిస్సయ్యారు. దీంతో ఆయన వ్యాఖ్యలు బూమరాంగ్ అయి.. నెటిజన్ల నుంచే కాకుండా.. టీడీపీ నేతల నుంచికూడా పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. ఇదేంటి? మనోడు ఇలా అనేశాడు! అంటూ.. టీడీపీ నేతలు గుసగులాడుకునేలా చేశాయి. ప్రస్తుతం వైసీపీ మాజీ మంత్రి, తన చిరకాల ప్రత్యర్థి కాకాని గోవర్ధన్‌రెడ్డి.. గనుల కేసు సహా.. గిరిజనులను తూలనాడారని.. కులం పేరు పెట్టి తిట్టారని నమోదైన అట్రాసిటీ కేసులో కనిపించకుండా తప్పించుకుంటున్నారు.
ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ అధికారులు కాకానిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. ఆయన ఎక్కడున్నదీ ఇప్పటి వరకు ఆచూకీ కనిపించలేదు. పైగా పోలీసుల నుంచి ఇంకా వెతుకుతూనే ఉన్నాం' అంటూ సమాధానం లభిస్తోంది. దీంతో కాకానిని ఎప్పుడు అరెస్టు చేస్తారా? అని కళ్లు కాయలు కాచాలే ఎదురు చూసిన సోమిరెడ్డికి ఆ కల ఫలించడం లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా జగన్‌కు కొన్ని సవాళ్లు విసిరారు సోమిరెడ్డి. 'జగన్‌కు దమ్ముంటే.. కాకానిని పోలీసులకు అప్పగించాలి. ఈ కేసులో పోలీసులకు సహకరించాలి' అని వ్యాఖ్యానించారు. దీనికి ముందు తర్వాత కూడా.. ఇంకా ఏవో అన్నా.. ఈ వ్యాఖ్యలు మాత్రం నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. ఎక్కడైనా ఏ పార్టీ నాయకుడైనా.. పనిగట్టుకుని తన వారిని తీసుకువచ్చి జైలుకు పంపిస్తారా? పైగా తన కులపు నాయకుడు.. సో.. సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో పసలేదని కొందరు అంటే.. లాజిక్ మిస్ అయ్యారని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇదీ. సంగతి!!