కొత్త సర్వే రిపోర్ట్: సోలో బ్రతుకు - మ్యారేజ్ లైఫ్.. ఏది బెటర్..!
ఒకప్పుడు ఆడపిల్లలకు మైనారిటీ తీరిందంటే పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టేవారు.
By: Tupaki Desk | 11 July 2025 4:00 PM ISTఒకప్పుడు ఆడపిల్లలకు మైనారిటీ తీరిందంటే పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టేవారు. ఇక అబ్బాయికి పాతిక వస్తున్నాయంటే పెళ్లిల్ల పేరయ్యలు వారింటి చుట్టూ తిరిగేవారు! పిల్లలను ఒక ఇంటివారిని చేసేయాలని, త్వరగా ముడి పెట్టేస్తే తమ బాధ్యతలు తీరిపోతాయని తల్లితండ్రులు భావించేవారు. అయితే ఇప్పుడు లెక్కలు మారాయి. ఆలోచనలూ మారాయి!
అవును... వివాహం విషయంలో ఈ రోజుల్లో యువత ఆలోచనలు చాలా మారిపోయాయని అంటున్నారు. మారుతున్న సామాజిక పరిస్థితులో, వ్యక్తిగత కారణాలో, కెరీర్ కే అధిక ప్రాధాన్యత ఇవ్వడమో.. కారణం ఏదైనా, కారణాలు ఎన్నైనా.. ప్రస్తుతం భారత్ లో ఇప్పుడిప్పుడే ఈ ధోరణి పుంచుకుంటున్నట్లు కనిపిస్తుండగా.. పాశ్చాత్య దేశాల్లో పీక్స్ కి చేరుకుంటుందని అంటున్నారు.
తాజాగా కార్నెల్ యూనివర్సిటీ - ప్యూ రీసెర్చ్ సెంటర్ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా.. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ నలుగురిలో ఒకరు వివాహం చేసుకోవడం కంటే జీవితాంతం సోలోగా బ్రతికేడమే బెటరని, ఒంటరిగా ఉండటం అన్ని విధాలా బెటనే భావనలో ఉన్నట్లు తేలిందని సర్వే స్పష్టం చేసింది!
ప్రధానంగా... యునైటెడ్ స్టేట్స్ లో సుమారు 25% మంది వయోజనులు తమ జీవితంలో ఎప్పటికీ వివాహం చేసుకోకపోవచ్చని అంచనా వేసినట్లు చెబుతున్నారు. ఇలా సుమారు వందలో పాతిక మంది సోలో బ్రతుకే సో బెటర్ అనడంతో ప్రపంచానికి ముందు ముందు ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. దీనికి అనేక కారణాలున్నాయని అంటున్నారు.
వాస్తవానికి ఒకప్పుడు వివాహం చేసుకోకుండా ఉండటాన్ని లోపంగా, శాపంగా భావించేవారు! అయితే ఇప్పుడు జనాల్లో ఆ ఆలోచన మారిందని అంటున్నారు. ఇందులో పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. భాగస్వాములు ఒకరిపై ఒకరు నమ్మకంగా ఉండలేకపోవడం ఒక కారణం కాగా.. స్వేచ్ఛగా, తమకు నచ్చినట్లు బ్రతకాలనే భావన అటు పురుషుల్లోనూ, ఇటు స్త్రీలలోనూ ఉండటం మరో కారణం అని చెబుతున్నారు.
ఇదే సమయంలో... ఆధునిక సమాజంలో కెరీర్, ఆర్థిక భద్రత, వ్యక్తిగత లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెడుతుండం మరో కారణం అని అంటున్నారు. ఇప్పటికే ప్రపంచం దేశాలకు తగ్గుతున్న జననాల రేటు అతిపెద్ద సమస్యగా మారబోతుందని హెచ్చరికలు వినిపిస్తోన్న వేళ.. ఈ ఆలోచనా ధోరణి ఆ రకంగానూ సమస్యే అని అంటున్నారు. మరి భవిష్యత్తులో ఈ సోలో బ్రతుకే సో బెటర్ ఆలోచన ధోరణి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది వేచి చూడాలి.
