Begin typing your search above and press return to search.

'జై జవాన్.. జై కిసాన్' నినాదానికి నిజమైన అర్థం చెప్పిన సైనికులు!

'జై జవాన్.. జై కిసాన్' ఈ నినాదం కేవలం మాటలు కాదని.. అది భారతీయ సైనికుడి , రైతుకు మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని తెలియజేస్తుందని నల్గొండ జిల్లాలో జరిగిన అరుదైన ఘటన నిరూపించింది.

By:  Tupaki Desk   |   18 April 2025 2:46 PM IST
జై జవాన్.. జై కిసాన్ నినాదానికి నిజమైన అర్థం చెప్పిన సైనికులు!
X

భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశానికి రైతే వెన్నుముక. అలాగే సరిహద్దుల్లో శత్రువుల నుంచి కాపాడే జవాన్లే మన ధైర్యం. దేశానికి ఈ ఇద్దరూ రెండు కళ్లలాంటివారు. ఒకరు అన్నం పెడితే, మరొకరు మన ప్రాణాలు కాపాడతారు. మరి ఈ ఇద్దరి ప్రాధాన్యతను తెలిపే ఒక అద్భుతమైన ఘటన నల్గొండలో జరిగింది. అకాల వర్షంలో తడిసిపోతున్న రైతు పంటను కాపాడటానికి సైనికులు చూపిన మానవత్వం ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

'జై జవాన్.. జై కిసాన్' ఈ నినాదం కేవలం మాటలు కాదని.. అది భారతీయ సైనికుడి , రైతుకు మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని తెలియజేస్తుందని నల్గొండ జిల్లాలో జరిగిన అరుదైన ఘటన నిరూపించింది. అకాల వర్షం కారణంగా రోడ్డు మీద ఆరబోసిన ధాన్యం తడిసిపోతుంటే, తమకు సంబంధం లేకపోయినా వెంటనే స్పందించి సహాయం చేసిన జవాన్ల మానవత్వం అందరి మనసులను తాకింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జవాన్ల మీద ప్రశంసల వర్షం కురుస్తుంది.

వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లాలో రైతులు తమ పంటను ఆరబెట్టడానికి సరిపడా స్థలం లేకపోవడంతో రోడ్డు పక్కన ఆరబోశారు. అయితే, హఠాత్తుగా వాతావరణం మారిపోయి వర్షం కురవడం మొదలైంది. రైతులు పొలం నుండి వచ్చి ధాన్యాన్ని కాపాడేలోపే అంతా తడిసి ముద్దయ్యే ప్రమాదం ఉంది. అదే సమయంలో దేవుళ్ల మాదిరి తమ విధులు ముగించుకుని అటుగా వెళ్తున్న కొందరు జవాన్లు రోడ్లు మీద తడిసిపోతున్న ధాన్యాన్ని గమనించారు.

వారు ఓ క్షణం కూడా లేట్ చేయకుండా తమ వాహనం దిగిపోయారు. యుద్ధరంగంలోకి దిగిన సైనికుల్లా మరు క్షణంలోనే గుంపులుగా విడిపోయి.. ఆ తడిసిపోతున్న ధాన్యంపై టార్పాలిన్ పట్టాలు కప్పడం మొదలు పెట్టారు. దాదాపు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నా, వర్షంలో తడుస్తూ కూడా తమది కాని ధాన్యాన్ని కాపాడేందుకు జవాన్లు చూపిన చొరవ కోట్లాది మంది భారతీయులను కదిలించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు జవాన్ల గొప్ప మనసును కొడియాడుతూ కామెంట్స్ చేస్తున్నారు. "నిప్పుల వర్షం కురిసినా, తూటాలు దూసుకుని వచ్చినా, అకాల వర్షంలో రైతులకు అండగా నిలిచేది ఒక్క సైనికుడే.. మీకు ఎవరూ సాటి రారు.. మీ త్యాగానికి జోహార్లు" అంటూ జవాన్లను పొగిడేస్తున్నారు. "జై జవాన్.. జై కిసాన్ అనే నినాదం ఊరికే రాలేదు" అని వారి సేవను గుర్తు చేసుకుంటున్నారు.