Begin typing your search above and press return to search.

ఘోరం.. సంపులో పడి సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ మృతి.. వీడియో వైరల్!

ఈ క్రమంలో... హైదరాబాద్‌ లో వాటర్ సంపు మూత పెట్టకుండా నిర్లక్ష్యం వహించడంతో అందులో పడి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతిచెందిన ఘటన తాజాగా జరిగింది.

By:  Tupaki Desk   |   22 April 2024 11:30 AM GMT
ఘోరం.. సంపులో పడి సాఫ్ట్‌  వేర్  ఇంజినీర్  మృతి.. వీడియో వైరల్!
X

ఏ సమయానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించాల్సిన రోజులివి. చిన్నపాటి నిర్లక్ష్యానికి పెను ప్రమాదాలు ఎన్ని తలేత్తుతున్నా మనిషిలో మార్పు రావడం లేదు. ఈ క్రమంలో... హైదరాబాద్‌ లో వాటర్ సంపు మూత పెట్టకుండా నిర్లక్ష్యం వహించడంతో అందులో పడి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతిచెందిన ఘటన తాజాగా జరిగింది.

అవును... హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఓ హాస్టల్ యజమాని నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. నీటి సంపులో పడి మృతి చెందాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధి అంజయ్య నగర్ లోని ఒక హాస్టల్ లో ఈ ఘోరం జరిగింది.

కేవలం వాటర్ సంపు పైమూత తెరిచి ఉంచిన నిర్లక్ష్యం ఫలితంగా ఈ దారుణం చోటు చేసుకుంది. దీంతో బయటనుంచి వస్తూ గేటు తీసుకుని లోపలికి ఎంటరైన ఆ యువకుడు సంపులో పడిపోయాడు. ఈ సమయంలో అతడి తలకు బలమైన గాయం అవ్వడంతో సంపులోనే చనిపోయాడని తెలుస్తుంది. దీంతో... సంపుపై మూత పెట్టకుండా నిర్లక్ష్యం వహించిన హాస్టల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ దారుణం మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సమయంలో కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమయంలో... హాస్టల్ యజమాని నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొందని స్థానికులు కంటతడి పెడుతుండగా.. ఓ ప్రాణం పోయేందుకు కారణమైన హాస్టల్ యాజమానిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.