Begin typing your search above and press return to search.

800 కోట్ల మందిలో 500 కోట్ల మంది "సోషలైట్లే"..

భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలను ప్రభావింత చేసే స్థాయికి వెళ్లింది సోషల్ మీడియా అంటే ఇందులో అతిశయోక్తి లేదు

By:  Tupaki Desk   |   12 Feb 2024 8:38 AM GMT
800 కోట్ల మందిలో 500 కోట్ల మంది సోషలైట్లే..
X

ఓ 20 ఏళ్ల కిందట సెల్ ఫోన్ అంటే అద్భుతం.. ఓ 10 ఏళ్ల కిందట స్మార్ట్ ఫోన్ అంటే అనూహ్యం.. కానీ, ఇప్పుడు.. కనీస స్థాయి ధరలో స్మార్ట్ ఫోన్ ఉండాలనేది అందరి భావనగా మారిపోయింది. ఇక అందులోనూ ’సోషల్ మీడియా’ తప్పనిసరి. అంతగా కమ్మేసింది ఆ మేనియా. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఐదేళ్లుగా అయితే సోషల్ మీడియా ప్రజల జీవనంలో భాగమైంది. 2016లో ఏ ముహూర్తాన ఇంటర్నెట్ చౌకగా మారిందో.. అప్పటినుంచే సోషల్ మీడియా మరింతగా చొచ్చుకెళ్లింది.

ఎన్నికలనూ ప్రభావితం చేసేంతగా..

భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలను ప్రభావింత చేసే స్థాయికి వెళ్లింది సోషల్ మీడియా అంటే ఇందులో అతిశయోక్తి లేదు. గత కొన్ని సంవత్సరాల్లోని ఎన్నికలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు, మార్పులకు కారణమైంది సోషల్ మీడియా. అందుకనే ఏదైనా సంఘటన జరగ్గానే ముందుగా సోషల్ మీడియా మీద నియంత్రణ కోసం ఇంటర్నెట్ ను బంద్ చేయడం చూస్తున్నాం. మరోవైపు వివిధ వర్గాల వారు భావ వ్యక్తీకరణకు వేదికగానూ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. వీరిలో రాజకీయ నాయకులు మొదలు సినీ, క్రికెట్ స్టార్లు ఉండడం గమనార్హం. అలాంటి సోషల్ మీడియా ఇప్పుడు ఓ మైలురాయిని చేరుకుంది.

62 శాతం ప్రపంచ జనాభా..

ఇప్పుడంతా సోషల్ మీడియా శకమే. గంటల తరబడి అందులో మునిగితేలుతున్నారు. దీనికి చిన్నాపెద్దా ఎవరూ అతీతులు కారు. తాజాగా వెలువడిన ఓ సర్వే కూడా ఇదే విషయం స్పష్టం చేస్తోంది. ప్రపంచ జనాభా ఆరు నెలల కిందట 800 కోట్ల మార్కును దాటిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటున్న వారి సంఖ్య ఎంతనో తెలుసా? 504 కోట్లు. అంటే మొత్తం జనాభాలో 62.30 శాతం అన్నమాట. ఇంకో విశేషం ఏమంటే నిరుటితో పోలిస్తే 26.60 కోట్ల మంది కొత్త యూజర్లు చేరారు. అంటే.. గత ఏడాది 475 కోట్ల మంది యూజర్లు ఉన్నారన్నమాట. తాజాగా 504 కోట్ల మంది వినియోగాదారుల్లో 53.50 శాతం మంది పురుషులు, 46.50 శాతం మంది మహిళలు.

మున్ముందు పెరుగుదలే తగ్గదు

ఎన్ని విమర్శలు వచ్చినా, ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపినా మున్ముందు సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య పెరగడమే కానీ.. తగ్గడం ఉండదనేది స్పష్టం. ఏడాదిలోనే 26 కోట్ల మంది కొత్త వినియోగదారులు చేరారంటే పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉందో స్పష్టమవుతోంది. మార్కెట్ లోకి రోజుకో రకం కొత్త స్మార్ట్ ఫోన్ వస్తున్న నేపథ్యంలో మూడేళ్లలోపే సోషల్ మీడియా ఖాతాదారుల సంఖ్య 700 కోట్లకు చేరడం ఖాయమనేది విశ్లేషకుల అంచనా.