Begin typing your search above and press return to search.

సోషల్‌ మీడియాకు వేల కోట్ల ఆదాయం వారి నుంచే!

ఈ నేపథ్యంలో ఈ సంస్థలు ప్రకటనల రూపంలో వేల కోట్ల రూపాయల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అందులోనూ 18 ఏళ్ల లోపువారి వల్లే ఈ సంస్థలకు భారీ ఆదాయం వస్తుందని తాజాగా ఒక సర్వే తేల్చింది.

By:  Tupaki Desk   |   1 Jan 2024 11:30 PM GMT
సోషల్‌ మీడియాకు వేల కోట్ల ఆదాయం వారి నుంచే!
X

ఇనస్ట్రాగామ్, ఎక్స్‌ (గతంలో ట్విట్టర్‌) స్నాప్‌ చాట్‌ వంటి సోషల్‌ మీడియాను కోట్లాది మంది ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. ఈ దిగ్గజ సంస్థలకు మనదేశంలోనూ కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థలు ప్రకటనల రూపంలో వేల కోట్ల రూపాయల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అందులోనూ 18 ఏళ్ల లోపువారి వల్లే ఈ సంస్థలకు భారీ ఆదాయం వస్తుందని తాజాగా ఒక సర్వే తేల్చింది.

ఈ మేరకు ఫేస్‌ బుక్, ఇనస్ట్రాగామ్, స్నాప్‌ చాట్, టిక్‌ టాక్, ఎక్స్, యూట్యూబ్‌ లతో నిమగ్నమయ్యే యువ వినియోగదారుల సంఖ్యను, ఈ ప్లాట్‌ ఫారమ్‌ ల ద్వారా వచ్చే సంబంధిత ప్రకటనల ఆదాయాన్ని అంచనా వేయడానికి పరిశోధకులు 2021, 2022 పబ్లిక్‌ సర్వే, మార్కెట్‌ రీసెర్చ్‌ డేటాను ఉపయోగించారు.

18 ఏళ్లలోపు వారు సోషల్‌ మీడియాను అత్యధికంగా వినియోగిస్తుండటంతో 2022లో సోషల్‌ మీడియా సంస్థలకు భారీ ఆదాయం చేకూరింది. ప్రకటనల రూపంలో ఏకంగా 11 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని పొందాయని సర్వే పేర్కొంది. స్నాప్‌ చాట్, టిక్‌ టాక్, యూట్యూబ్‌ ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయంలో దాదాపు 30–40 శాతం యువత వల్లే వస్తోందని వెల్లడించింది ఈ మేరకు అమెరికాలోని హార్వర్డ్‌ టీహెచ్‌ చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనం నిర్వహించాయి.

ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

12 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులకు సంబంధించి 2022లో అత్యధికంగా యూట్యూబ్‌ 1 బిలియన్‌ డాలర్లను ప్రకటనల ద్వారా ఆర్జించింది. ఇక 13–17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి సంబంధించి అత్యధికంగా ఇనస్టాగ్రామ్‌ 4 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని సంపాదించింది.

13–17 సంవత్సరాల వయస్సు గల వినియోగదారుల నుండి 2022లో టిక్‌ టాక్‌ 2 బిలియన్‌ డాలర్లు, యూట్యూబ్‌ 1.2 బిలియన్‌ డాలర్లు సంపాదించాయి.

ఈ సోషల్‌ మీడియా దిగ్గజాల వల్ల యువతకు ప్రమాదం ఉందని అధ్యయనం పేర్కొంది. యువత సోషల్‌ మీడియా మోసాలకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని ఆయా సంస్థలు చెప్పినప్పటికీ ఇంకా చర్యలు తీసుకోలేదని అధ్యయనం పేర్కొంది. సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫారమ్‌ లు యువత నుండి గణనీయమైన ప్రకటనల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని అధ్యయనం తెలిపింది,

కాగా 2022లో యూట్యూబ్‌ కు 18 ఏళ్లలోపు వారు 50 మిలియన్ల మంది వినియోగదారులుగా ఉన్నారు. ఇక టిక్‌ టాక్‌ కు 19 మిలియన్లు, స్నాప్‌ చాట్‌ కు 18 మిలియన్లు, ఇనస్ట్రాగామ్‌ కు 16.7 మిలియన్లు, ఫేస్‌ బుక్‌ కు 10 మిలియన్లు, ఎక్స్‌ కు 7 మిలియన్లు మంది వినియోగదారులు ఉన్నారు.