సోషల్ మీడియాతో అతి పెద్ద సమస్య....బాబు హాట్ కామెంట్స్
సోషల్ మీడియా చాలా కాలంగా మెయిన్ స్ట్రీం మీడియాకు పోటీగా తయారయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అనుభవం కలిగిన జర్నలిస్టులు పనిచేస్తారు.
By: Satya P | 28 March 2026 11:48 PM ISTసోషల్ మీడియా చాలా కాలంగా మెయిన్ స్ట్రీం మీడియాకు పోటీగా తయారయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అనుభవం కలిగిన జర్నలిస్టులు పనిచేస్తారు. జర్నలిజం పట్ల అవగాహన ఉన్న వారు అక్కడ ఉంటారు. అది ఒక వ్యవస్థగా ఉంటూ వస్తోంది. అయితే డిజిటల్ యుగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అలా సోషల్ మీడియా ప్రజల చేతుల్లోకి వచ్చింది. దాంతో స్మార్ట్ ఫోన్ ఉన్న వారు అంతా పాత్రికేయుల అవతారం ఎత్తుతున్నారు. విషయం తెలియకుండా నిజానిజాలు ఏమిటో ఆలోచించకుండా సంచలనం కోసం పోస్టులు పెడుతున్నారు. దాని వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సోషల్ మీడియా వైఖరి మీద హాట్ కామెంట్స్ చేయడం విశేషం.
నియంత్రించేలా చూడాలి :
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐజేయూ 11వ ప్లీనరీలో పాల్గొన్న చంద్రబాబు సోషల్ మీడియా మీద కీలక వ్యాఖ్యలే చేశారు. సోషల్ మీడియాతో అతి పెద్ద సమస్య అవుతోందని ఆయన అన్నారు. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆయన చెప్పారు. అలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగకుండా కట్టడి చేసే బాధ్యతలను జర్నలిస్టులు తీసుకోవాలని బాబు కోరారు. తనకు మూడు దశాబ్దాలుగా జర్నలిజంతో, జర్నలిస్టులతో అనుబంధం ఉందని బాబు చెప్పుకొచ్చారు. మీడియాలో ప్రతి రోజూ వచ్చే వార్తాంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. మీడియాకు అంతటి ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు.
మీడియా పోకడలు మారాయి :
అయితే వర్తమానంలో మీడియా పోకడలు మారాయని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాలను చిత్రీకరిస్తున్నారని, తన పైన కూడా అనేక రకాలుగా తప్పుడు వార్తలు రాశారని అన్నారు. అప్పట్లో వైఎస్ వివేకా మరణాన్ని గుండెపోటుగా చిత్రీకరించారని, ఆ తరువాత పోస్ట్ మార్టానికి ఆదేశిస్తే అసలు విషయాలు బయటపడ్డాయని బాబు చెప్పారు. అలాంటి విపరీత పొకడలకు పోయే జర్నలిజం సమాజానికి మంచిది కాదని బాబు హితవు పలికారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు ఉంటున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని బాబు అన్నారు. మీడియాలో విలువలు, సిద్దాంతాలు పడిపోతున్నాయని చెప్పారు. దీన్ని పునరుద్దరించుకోవాల్సిన అవసరం ఉందని బాబు స్పష్టం చేశారు.
జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం :
పాత్రికేయులకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని బాబు చెప్పారు. తమది జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఆయన తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను వీలైనంత వరకు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అదే సమయంలో రాష్ట్రాభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని బాబు కోరారు. మంచిని అభివృద్ధిని మీడియా ప్రమోట్ చేయాలని సూచించారు. పాజిటివ్ న్యూస్ ఇవ్వమని కోరడం లేదని అదే సమయంలో ప్రొగ్రెసివ్ న్యూస్ ఇవ్వాలని కోరుతున్నామని ఆయన అన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని మీడియానే ప్రపంచానికి తెలియచేయాలని బాబు దిశా నిరెదేశం చేశారు. ఇక వివిధ రంగాల్లో ఏపీ అభివృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. అలా ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని జర్నలిస్టులు అధ్యయనం చేసి విశ్లేషించాలని కోరారు.
