గోరింటాకు తెచ్చిన తంటా.. ఆగిన చిన్నారి పెళ్లికూతురు పెళ్లి!
సరదాగా షేర్ చేసిన ఫొటోలు కాస్తా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో అధికారులు రంగంలోకి దిగి పెళ్లిని అడ్డుకున్నారు. ఊహించని విధంగా జరిగిన ఈ ఆసక్తికరమైన ఘటన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
By: Madhu Reddy | 22 Jun 2026 1:01 PM ISTఫ్యాషన్ కోసం చేసుకున్న ప్రీ-వెడ్డింగ్ షూట్, చేతికి పెట్టుకున్న గోరింటాకు.. ఒక బాలిక జీవితాన్ని మార్చేస్తాయని ఎవరూ ఊహించి ఉండరు.. మహారాష్ట్రలో జరగాల్సిన ఒక బాల్యవివాహం సోషల్ మీడియా పుణ్యమా అని చివరి నిమిషంలో ఆగింది. సరదాగా షేర్ చేసిన ఫొటోలు కాస్తా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో అధికారులు రంగంలోకి దిగి పెళ్లిని అడ్డుకున్నారు. ఊహించని విధంగా జరిగిన ఈ ఆసక్తికరమైన ఘటన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో షూట్:
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా గెవరాయీ మండలానికి చెందిన ఒక 23 ఏళ్ల యువకుడికి, కేవలం 15 ఏళ్ల మైనర్ బాలికతో పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి అంతా సిద్ధం చేసి, గ్రాండ్‌గా ప్రీ-వెడ్డింగ్ ఫొటో షూట్ కూడా జరిపించారు. ఇక ఆ ముచ్చటైన ఫొటోలు, వీడియోలను బంధువులు సరదాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, అదే వాళ్లకు పెద్ద తంటా తెచ్చిపెడుతుందని వాళ్లు అస్సలు ఊహించలేదు.
కలెక్టర్ ఎంట్రీ.. అధికారుల అలర్ట్:
సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ ఫొటోలు కాస్తా జిల్లా కలెక్టర్ వివేక్ జాన్సన్ కంటపడ్డాయి. అందులో పెళ్లికూతురు చాలా చిన్న పిల్లగా కనిపించడంతో ఆయన వెంటనే అలర్ట్ అయ్యారు. ఇక మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను పిలిపించి, వెంటనే విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు హుటాహుటిన ఆ బాలిక ఉంటున్న గ్రామానికి చేరుకున్నారు.
గోరింటాకుతో దొరికిపోయిన వైనం:
అధికారులు ఊర్లోకి వెళ్లి చూసేసరికి బాలిక చేతుల నిండా ముచ్చటగా గోరింటాకు, అందులో వరుడి పేరు రాసి ఉంది. పెళ్లి పనులు జరుగుతున్నా, అప్పటికప్పుడు వివాహం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పెళ్లి ఇంకా అవ్వలేదని అధికారులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక వెంటనే పెళ్లి ఏర్పాట్లను నిలిపివేయించి, ఆ బాల్యవివాహాన్ని పూర్తిగా అడ్డుకున్నారు.
చట్టపరమైన చర్యలు:
అధికారులు ఆ మైనర్ బాలికను తమ సంరక్షణలోకి తీసుకుని ల్యాండ్స్ కౌన్సెలింగ్ ఇచ్చారు. మన దేశంలో 18 ఏళ్లలోపు అమ్మాయిలకు, 21 ఏళ్లలోపు అబ్బాయిలకు పెళ్లి చేయడం చట్టరీత్యా పెద్ద నేరం. అందుకే ఈ బాల్యవివాహాన్ని కుదిర్చిన తల్లిదండ్రులు, బంధువులు, పెళ్లి పెద్దలపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
సాధారణంగా సోషల్ మీడియాను మనం కేవలం వినోదం కోసమే వాడుతుంటాం. కానీ ఈ ఘటనలో మాత్రం అది ఒక చిన్నారి భవిష్యత్తును కాపాడిన ఒక గొప్ప ఆయుధంగా మారింది. ఇక ఆ ఫొటోలు గనుక బయటకు రాకపోయి ఉంటే, చట్టానికి తెలియకుండా ఆ బాలిక పెళ్లి నిశ్శబ్దంగా జరిగిపోయేదని అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనా.. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ఆ పాప లైఫ్ మాత్రం సేఫ్‌గా బయటపడింది.
