Begin typing your search above and press return to search.

కొత్త రచ్చ... వైష్ణోదేవి మెడికల్ కాలేజీలో 50 సీట్లలో 42 మంది ముస్లింలు!

ఇటీవల ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్లలోని దర్యాప్తులో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   23 Nov 2025 11:00 PM IST
కొత్త రచ్చ... వైష్ణోదేవి  మెడికల్  కాలేజీలో 50 సీట్లలో 42 మంది ముస్లింలు!
X

ఇటీవల ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్లలోని దర్యాప్తులో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఉగ్ర డాక్టర్ల గ్రూపు వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఓ మెడికల్ కాలేజీకి కేటాయించబడిన సీట్లలో మెజారిటీ సీట్లలో ముస్లిం విద్యార్థులకు అడ్మిషన్స్ దొరికిన వ్యవహారంపై బీజెపీ మండిపడుతోంది.

అవును... జమ్మూకశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ (ఎస్ఎంవీడీఐఏంఈ)లో ముస్లిం విద్యార్థుల ప్రవేశంపై రియాసీ జిల్లాలో అనేక గ్రూపులు నిరసనలు చేపట్టిన కొన్ని రోజుల తర్వాత.. బీజేపీ జమ్మూ కశ్మీర్ శాఖ అధికారికంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలిసి ఒక మెమరాండం సమర్పించింది.

వివరాళ్లోకి వెళ్తే... 2025-26 విద్యా సంవత్సరానికిగానూ 50 మందితో కూడిన ఫస్ట్ బ్యాచ్ లో 42 మంది ముస్లిం విద్యార్థులు ఉన్నట్లు ఇనిస్టిట్యూట్ తొలి ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు జాబితాలో చూపబడింది. దీంతో ఒక్కసారిగా దీనిపై వివాదం చెలరేగింది. వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు నిధులు సమకూర్చే ఒక సంస్థ హిందూ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది!

ఇదే సమయంలో.. ఈ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో కమ్యూనిటీ ఆధారిత రిజర్వేషన్లు ప్రారంభించడానికి ఎస్ఎంవీడీఐఏంఈ ను మైనారిటీ సంస్థగా ప్రకటించాలని అనేక హిందూ సంస్థలు డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి! ఇదే క్రమంలో... వైష్ణో దేవి యాత్రికుల భక్తి, కానుకలతో నిర్మించబడిన సంస్థలు ఆలయ నైతికతను ప్రతిబింబించాలని ఉధంపూర్ బీజేపీ ఎమ్మెల్యే ఆర్.ఎస్. పఠానియా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా 50 అడ్మిషన్స్ లోనూ 42 ముస్లింలు, ఏడుగురు హిందువులు, ఒక్క సిక్కు మాత్రమే ప్రవేశం పొందారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పంపిణీ ఆమోదయోగ్యం కాదని, ఈ సమయంలో కొత్త అడ్మిషన్ ప్రక్రియను ప్రవేశపెట్టాలను పట్టుబడుతున్నారు!

స్పందించిన అధికారులు!:

ఈ వ్యవహారంపై ఇనిస్టిట్యూట్ అధికారులు స్పందించారు! ఇందులో భాగంగా... ఆలయ నిధులతో నడిచే ఈ సంస్థకు ఈ ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు అయ్యాయని.. అడ్మిషన్లు మెరిట్ ఆధారితంగానే జరిగాయని పేర్కొన్నారు. ఈ ఇనిస్టిట్యూట్ కి మైనారిటీ హోదా మంజూరు కాలేదని, అందువల్ల మతంతో ముడిపడిన రిజర్వేషన్లను వర్తింపజేయలేమని నొక్కి చెప్పారు!