Begin typing your search above and press return to search.

ఆ పోస్ట్ లో అంత అర్థం లేదు.. స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్!

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ అంటే తెలంగాణలో తెలియని వారు ఉండరు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ అధికారిగా గుర్తింపు సంపాదించుకున్నారు

By:  Tupaki Desk   |   14 Dec 2023 7:32 AM GMT
ఆ పోస్ట్ లో అంత అర్థం లేదు.. స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్!
X

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ అంటే తెలంగాణలో తెలియని వారు ఉండరు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ అధికారిగా గుర్తింపు సంపాదించుకున్నారు. తెలంగాణ ఆవిర్భావానికి కంటే ముందు నుంచి ఆమె ఇక్కడే పాలనాధికారిగా విధులు నిర్వర్తించారు. ఆమె పనితనానికి ఫిదా అయిన కేసీఆర్ ఆమెకు తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శిగా కేసీఆర్ కు పని చేసిన ఆమె. ప్రస్తుతం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కొత్త సీఎం, మంత్రి వర్గాన్ని స్మితా సబర్వాల్ ఇప్పటి వరకు కలవలేదు. దీంతో రాష్ట్రాంలోని ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నా ఆమె మాత్రం దూరంగానే ఉంటున్నారు. పాలనా పరమైన సమావేశాల్లో కూడా ఆమె కనిపించడం లేదు. ఇటీవల నీటి పారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి జలసౌధలో నిర్వహించిన సమీక్షకు ఆమె హాజరుకాలేదు.

ఈ నేపథ్యంలో ఆమె తను ఐఏఎస్ కొలువులో చేరిప్పటి ఫొటోను ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేసింది. ‘మనం ఎంత దూరం వచ్చామో కొన్ని ఫొటోలు మనకు గుర్తు చేస్తాయి. శిఖరాలను అందుకోవడం, లోయలో పడడం ప్రతీ వ్యక్తి జీవితంలో భాగమే. ఈ ఫొటో 23 సంవత్సరాల క్రితం తన ఇష్టానుసారం నడిచే ఒక యువతిది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు, కొత్త ఛాలెంజ్ కు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అని కోట్ చేసింది. దీంతో ఆమె తిరిగి కేంద్ర సర్వీస్ లోకి వెళ్తుందని అందరూ అనుకున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. ఆమె కేంద్ర సర్వీస్ లోకి వెళ్తే ఆమ్రపాళి స్టేట్ లోకి వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చాయి.

అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆమె ఎక్స్ (ట్విటర్)లోనే మరో పోస్ట్ చేసింది. ‘నేను సెంట్రల్ డిప్యుటేషన్‌కి వెళ్తున్నానని కొన్ని వార్తా ఛానెల్‌లు ఫేక్ న్యూస్ రిపోర్ట్ చేయడం చూశాను. అది విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇది పూర్తిగా అబద్ధం మరియు నిరాధారం. తెలంగాణ కేడర్‌కు చెందిన #IAS అధికారిగా, తెలంగాణ ప్రభుత్వం నాకు తగినదిగా భావించే ఏ బాధ్యతనైనా నేను కొనసాగిస్తాను మరియు నిర్వహిస్తాను. నా రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నాను.’ అంటూ మరో పోస్ట్ చేసింది. నా 23 సంవత్సరాల ప్రయాణానికి సంబంధించి కొన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నానే తప్ప కేంద్ర సర్వీస్ లోకి వెళ్తున్నట్లు చెప్పలేదన్నారు. ఏది ఏమైనా ఆమె రాష్ట్రం విడిచిపెడుతుందంటే దుమారమే రేగింది.