చిన్న పార్టీలు వర్సెస్ పెద్దపార్టీలు.. ఓటు బ్యాంకు ఎఫెక్ట్ ..!
క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలతో పాటు చిన్నాచితకా పార్టీలపై కూడా చర్చ అయితే జరుగుతోంది.
By: Tupaki Desk | 8 July 2025 8:15 AM ISTరాష్ట్రంలో చిన్న పార్టీలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అయితే గత ఎన్నికల సమయంలో పోటీకి వచ్చిన ఆ పార్టీలు ప్రస్తుతం కనిపించడం లేదు. జై భీమ్ పార్టీ, అదే విధంగా మాజీ ఐపీఎస్ అధికారి జెడి లక్ష్మీనారాయణ పెట్టుకున్న జైభారత్ నేషనల్ పార్టీతోపాటు లోక్ సత్తా, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు కూడా గత ఎన్నికల సమయంలో పోటీ చేశాయి. ఇక వీటితోపాటు సిపిఐ, సిపిఎం పార్టీలు కాంగ్రెస్ కూడా బరిలో నిలిచాయి. అయితే, ఎన్నికల తర్వాత చిన్నాచితక పార్టీలు కనిపించకుండా పోయినప్పటికీ.. వాటి తాలూకా ప్రభావం మాత్రం కనిపిస్తుంది.
తూర్పుగోదావరి సహా విజయనగరం, విశాఖపట్నం వంటి చోట్ల జెడి లక్ష్మీనారాయణ వంటి వారు తిరుగుతూ ఉండడంతో వారి ప్రభావం కనిపిస్తోంది. అదేవిధంగా ఇప్పుడు పుంజుకునే పరిస్థితిలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా స్మార్ట్ విద్యుత్తు మీటర్ల విషయంపై సిపిఐ ఉద్యమాన్ని లేవనెత్తుతోంది. సిపిఎం కూడా రైతుల పక్షాన నిలబడి మద్దతు ధరల విషయంలో పోరాటాలు చేసేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల తరచుగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. జగన్ పై అదేవిధంగా కూటమి ప్రభుత్వంపై కూడా ఆమె విమర్శలు చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలతో పాటు చిన్నాచితకా పార్టీలపై కూడా చర్చ అయితే జరుగుతోంది. ఇవేమీ అధికారంలోకి వచ్చేస్తాయని గానీ అధికారం పంచుకుంటాయని గాని చెప్పలేము. కానీ అధికారంలోకి వచ్చే ప్రధాన పార్టీలకు మాత్రం ఓటు బ్యాంకు విషయంలో గండిపడే అవకాశం ఉంది. ప్రధానంగా సిపిఐ చేపడుతున్న కార్యక్రమాలు ప్రభావంతంగానే కనిపిస్తున్నాయి. ఓటు బ్యాంకు విషయంలో కూడా కమ్యూనిస్టులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇక ఆమ్ ఆద్మీ, లోక్ సత్తా వంటి పార్టీలు పెద్దగా ప్రభావం చూపించక పోయిన క్షేత్రస్థాయిలో విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
విజయవాడలో జరిగిన వైద్య విద్యార్థుల ధర్నాకు లోక్‌సత్తా, అదేవిధంగా విజయవాడ ఆమ్ ఆద్మీ పార్టీలు మద్దతు పలికాయి. తద్వారా విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశాయి. ఇలా చిన్నాచితక పార్టీలు బలోపేతం అవుతుండడం పెద్ద పార్టీలకు ఇబ్బందికర పరిణామంగానే మారే అవకాశం కనిపిస్తుంది. అయితే భారీ స్థాయిలో ఇవి ప్రభావం చూపించకపోయినా ప్రధాన ఓటు బ్యాంకు ను మాత్రం ప్రభావితం చేయడం కచ్చితంగా ఉంటుందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఏమీ జరగకపోయినా భవిష్యత్తులో చిన్న పార్టీలు పుంజుకుంటే ఖచ్చితంగా పెద్ద పార్టీలకు ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుందనేది పరిశీలకుల భావన.
