Begin typing your search above and press return to search.

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర: విజయవంతంగా నింగిలోకి ఎగిరిన 'విక్రమ్-1'

దేశీయ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ శనివారం విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది

By:  A.N.Kumar   |   18 July 2026 1:18 PM IST
భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర: విజయవంతంగా నింగిలోకి ఎగిరిన విక్రమ్-1
X

భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం సరికొత్త మైలురాయిని అందుకుంది. దేశీయ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ శనివారం విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థ అయిన ఇస్రో ఆధిపత్యం వహించిన ఆర్బిటల్ ప్రయోగాల్లో తొలిసారి ఒక ప్రైవేట్ భారతీయ సంస్థ తన సత్తా చాటుతూ అంతర్జాతీయ స్పేస్ మార్కెట్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

సాంకేతిక లోపాలను అధిగమించి.. విజయ తీరాలకు!

శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 12:05 గంటలకు విక్రమ్-1 నింగిలోకి ప్రయాణమైంది. వాస్తవానికి ఈ ప్రయోగాన్ని ఉదయం 11:30 గంటలకే చేపట్టాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఇంధన వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

అయినప్పటికీ స్కైరూట్, ఇస్రో శాస్త్రవేత్తలు కేవలం 35 నిమిషాల వ్యవధిలోనే ఆ సమస్యను వేగంగా పరిష్కరించి, రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. దాదాపు 20 నిమిషాల ప్రయాణం తర్వాత విక్రమ్-1 రాకెట్ తన పేలోడ్లను నిర్దేశిత కక్ష్యలోకి అత్యంత ఖచ్చితత్వంతో ప్రవేశపెట్టింది. ఈ విజయంతో స్కైరూట్ సంస్థ ఆనందం వ్యక్తం చేస్తూ.. “హెల్లో స్పేస్… విక్రమ్ 1 వచ్చేసింది’’ అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ప్రకటించింది.

‘మిషన్ ఆగమన్’తో ప్రైవేట్ యుగం ప్రారంభం

స్కైరూట్ ఈ చారిత్రక ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అని పేరు పెట్టింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఆర్బిటల్ ప్రయోగాల యుగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ పేరును ఎంపిక చేశారు. ఈ మిషన్ ద్వారా గ్రహాస్పేస్, కాస్మోసెర్వ్, డీక్యూబ్డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ పేలోడ్లతో పాటు, స్కైరూట్ సొంతంగా రూపొందించిన ‘స్కోప్’ పేలోడ్‌ను కూడా అంతరిక్షంలోకి పంపారు.

ఈ ప్రయోగం ద్వారా రాకెట్‌లోని ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ వ్యవస్థల పనితీరును అంతరిక్ష వాతావరణంలో పరీక్షించి కీలక సమాచారాన్ని సేకరించనున్నారు. ఇది భవిష్యత్ వాణిజ్య ప్రయోగాలకు ఎంతగానో ఉపయోగపడనుంది.

ఆకర్షణీయంగా నిలిచిన ప్రత్యేక పేలోడ్లు

విక్రమ్-1 రాకెట్ కేవలం ఉపగ్రహాలనే కాకుండా కొన్ని చారిత్రక, ప్రత్యేక వస్తువులను కూడా రోదసిలోకి తీసుకెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వహస్తాలతో రాసిన ‘వందే మాతరం’ పోస్టుకార్డు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాస్మోస్ డైమండ్స్ రూపొందించిన ‘కాస్మిక్ బ్లూమ్’ ఆర్ట్‌వర్క్. విక్రమ్-1 సూక్ష్మ ప్రతిరూపంపై భారత శాస్త్ర ప్రపంచ మార్గదర్శకులైన సర్ సీవీ రామన్, విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంల చిత్రాలను చెక్కారు. స్కైరూట్ బృందం, ఇస్రో మాజీ ఛైర్మన్లు, ప్రముఖ శాస్త్రవేత్తలు, భారతీయ వ్యోమగాములు పంపిన డజన్ల కొద్దీ చేతిరాత పోస్టుకార్డులను ఒక ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచి రోదసిలోకి పంపారు.

2022లో 'విక్రమ్-ఎస్' ద్వారా దేశంలోనే తొలి ప్రైవేట్ సబ్‌ఆర్బిటల్ రాకెట్‌ను ప్రయోగించిన స్కైరూట్.. ఇప్పుడు 'విక్రమ్-1' ద్వారా తొలి ప్రైవేట్ ఆర్బిటల్ ప్రయోగాన్ని కూడా విజయవంతం చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

ప్రత్యక్షంగా వీక్షించిన మంత్రి నారా లోకేశ్

ఈ చారిత్రక ఘట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ తన కుమారుడు దేవాంశ్తో కలిసి శ్రీహరికోటలోని ఇస్రో గ్యాలరీ నుండి ప్రత్యక్షంగా వీక్షించారు. రాకెట్ విజయవంతంగా దూసుకెళ్లిన అనంతరం ఆయన శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో మాజీ ఛైర్మన్లు, సీనియర్ శాస్త్రవేత్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

విక్రమ్-1 విజయంతో గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో చిన్న ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా భారత్ నిలవనుంది. అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రైవేట్ కంపెనీలకు బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు తలుపు తట్టేందుకు ఈ ప్రయోగం ఒక గట్టి పునాదిగా నిలిచింది.