ఈ ఏడాది కరువు తప్పదా? భయపెడుతున్న ఎల్ నినో
దీనివల్ల నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందని, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.
By: Tupaki Political Desk | 11 Feb 2026 7:00 AM ISTఈ ఏడాది జూన్ తర్వాత ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ అంచనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో 'లా నినా' పరిస్థితులు బలహీనపడుతున్నాయని, దీని తర్వాత సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించి, జూలై - ఆగస్టు 2026 నాటికి ఎల్ నినో పూర్తిస్థాయిలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఇప్పుడున్న పరిస్థితులు ప్రకారం ఎల్ నినో ఏర్పడేందుకు 50 శాతం అవకాశాలు ఉన్నాయని స్కైమెట్ తాజా బులిటెన్ లో వెల్లడించింది. జులై, ఆగస్టు నాటికి 70 శాతం మేర ఎల్ నినో ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతోంది. స్కైమెట్ అంచనాకు అనుగుణంగానే ఇతర వాతావరణ మోడళ్లు కూడా ఎల్ నినో ఉంటుందని సంకేతాలిస్తుండటం ఆందోళనకు కారణమవుతోంది.
ఎల్ నినో ఏర్పడితే దేశంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత దశాబ్దకాలంలో దేశంలో ఒకటి కంటే ఎక్కువ సందర్భాల్లో కీలకమైన నైరుతు రుతుపవనాల సీజన్ లో ఎల్ నినోలు ఏర్పడి రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించాయని అంటున్నారు. ఎల్ నినో వల్ల వర్షాలు ఆలస్యంగా పడటం లేదా తక్కువ కురవడం జరుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా వేసవికాలం సుదీర్ఘంగా కొనసాగుతాయని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీనివల్ల నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందని, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. అంతేకాకుండా వర్షాభావం వల్ల వరి, చెరకు, పత్తి వంటి పంటల దిగుబడి తగ్గుతుందని, రైతులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఆహార పదార్థాల ధరలు పెరగడానికి అంతిమంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని అంటున్నారు. ఇక వర్షాభావం వల్ల జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోయి తాగునీటి సమస్యలు, విద్యుత్ అంతరాయాలు ఏర్పడతాయని అంటున్నారు.
ఇక చరిత్రను గమనిస్తే, భారత్‌లో సంభవించిన కరువులలో అధిక శాతం ఎల్ నినో సంవత్సరాల్లోనే నమోదయ్యాయని చెబుతున్నారు. 2009లో అత్యంత తీవ్రమైన ఎల్ నినో కారణంగా దేశంలో అంతకుముందు 30 ఏళ్లలో లేనంతగా 22 శాతం వర్షపాతం తగ్గిందని రికార్డులు చెబుతున్నాయి. దీనికారణంగా దేశవ్యాప్త కరువుకు దారితీసింది. అదేవిధంగా 2014-16 మధ్య ఎల్ నినో ప్రభావంతో వరుసగా రెండు ఏళ్లు వర్షాలు తగ్గి వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది. 2023లోకూడా ఎల్ నినో ప్రభావంతో ఆగస్టు నెలలో 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం నమోదైంది.
సాధారణంగా ఒకసారి ఎల్ నినో ఏర్పడితే దాని ప్రభావం 9 నుండి 12 నెలల వరకు ఉంటుందని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది 18 నెలల వరకు కూడా కొనసాగవచ్చు అని గత అనుభవాలు సూచిస్తున్నాయి. ఎల్ నినో జూలైలో ప్రారంభమైతే, తర్వాతి ఏడాది వేసవి వరకు ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ఆ తర్వాత 'లా నినా' ఏర్పడే వరకు దుర్భిక్ష పరిస్థితులే కొనసాగుతాయని అంటున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎల్ నినో వచ్చే అవకాశం ఉన్నందున, రైతులు, ప్రభుత్వం ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు, నీటి నిల్వ నిర్వహణపై ఇప్పుడే దృష్టి పెట్టడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
