Begin typing your search above and press return to search.

ఆరున్న కోట్ల సొమ్ము స్వాధీనం.. అన్ని వేళ్లూ ఖ‌మ్మం వైపే!

అయితే.. ప‌ట్టుబ‌డుతున్న నిధులు ఎవ‌రివ‌నే విష‌యం మాత్రం ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు.

By:  Tupaki Desk   |   18 Nov 2023 4:08 PM GMT
ఆరున్న కోట్ల సొమ్ము స్వాధీనం.. అన్ని వేళ్లూ ఖ‌మ్మం వైపే!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇటు ఎన్నిక‌ల సంఘం అధికారులు, మ‌రోవైపు ఐటీ అధికారులు.. ఇంకోవైపు పోలీసులు మూకుమ్మ‌డిగా త‌నిఖీలు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను ప్ర‌లోభ పెడుతున్న వారిపై చ‌ర్య‌ల‌కు ఉపక్ర‌మిస్తున్నారు. ఇప్ప‌టికే 800 కోట్ల రూపాయ‌ల‌ను గ‌త నెల రోజుల్లో స్వాధీనం చేసుకున్న అధికారులు ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో తనిఖీల‌ను మ‌రింత ముమ్మ‌రం చేశారు. అయితే.. ప‌ట్టుబ‌డుతున్న నిధులు ఎవ‌రివ‌నే విష‌యం మాత్రం ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు.

తాజాగా నిర్వ‌హించిన త‌నిఖీల్లో ఏకంగా ఆరు కార్ల‌లో త‌ర‌లిస్తున్న 6.5 కోట్ల రూపాయ‌ల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ప్రకియలో భాగంగా పోలీసులు హైద‌రాబాద్ నగరంలో ముమ్మ‌రంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా నగదును పట్టుకున్నారు. సుమారు 6.5 కోట్లు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బండ్లగూడ అప్పా జంక్షన్ వద్ద అధికారులు ఈ డబ్బులు పట్టుకున్నారు. ఆరు కార్లలో డబ్బులు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆయా వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవ‌ర్లను కూడా అరెస్టు చేశారు. అయితే.. ఈ సొమ్ము ఎక్క‌డ నుంచి త‌ర‌లించార‌నే విష‌యంపై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో ఖమ్మం జిల్లాకు చెందిన నేతకు సంబంధించిన నగదుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదిశ‌గా అక్క‌డి పోలీసులను కూడా అలెర్ట్ చేశారు. ఖ‌మ్మం జిల్లాలో ఇప్ప‌టికే ఇద్ద‌రు కీల‌క నేత‌ల ఇళ్ల‌పై ఐటీ అధికారులు త‌నిఖీలు చేసిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రూ కాంగ్రెస్ త‌ర‌ఫున ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో పోటీ ప‌డుతున్న వారే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు ప‌ట్టుబడిన న‌గ‌దు కూడా వారికి చెందిన‌దేనా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదే నిజ‌మైతే.. వారు ఇర‌కాటంలో ప‌డిన‌ట్టేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.