Begin typing your search above and press return to search.

ఆ కేసు పెడితే.. స్టేషన్ కు వెళ్లి ఈ వార్నింగులేంది రాచమల్లు?

తాజాగా ప్రత్యేక ఎన్ ఫోర్సుమెంట్ బ్యూరో (ఎస్ఈబీ) స్టేషన్ కు వెళ్లిన ఆయన.. అక్కడి ఎస్ఐకు స్టేషన్ లోనే వార్నింగ్ ఇచ్చేశారు.

By:  Tupaki Desk   |   12 Jan 2024 3:32 AM GMT
ఆ కేసు పెడితే.. స్టేషన్ కు వెళ్లి ఈ వార్నింగులేంది రాచమల్లు?
X

వెనుకా ముందు చూసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు.. సదరు నేత ఒక్కడికి మాత్రమే కాదు.. వారు ప్రాతినిధ్యం వహించే పార్టీకి కూడా తలనొప్పుల్ని తెచ్చి పెడుతుందన్న చిన్న లాజిక్ ను మిస్ అవుతుంటారు కొందరు సీనియర్ నేతలు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తాజాగా ప్రత్యేక ఎన్ ఫోర్సుమెంట్ బ్యూరో (ఎస్ఈబీ) స్టేషన్ కు వెళ్లిన ఆయన.. అక్కడి ఎస్ఐకు స్టేషన్ లోనే వార్నింగ్ ఇచ్చేశారు. అవసరమైతే చట్టాన్ని మార్చుకో.. కేసు మాత్రం పెట్టొద్దన్న ఆయన అక్కడితో ఆగక.. ఎస్పీకి చెప్పుకుంటావో.. వాళ్ల బాబుకు చెప్పుకుంటావో నాకు సంబంధం లేదు కేసు పెడితే మాత్రం ఊరుకోనంటూ అందరి ఎదుట చేస్తున్న వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి.

ప్రొద్దుటూరుకు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి పరిమితికి మించి మద్యం బాటిళ్లను తీసుకొని వెళుతుండగా గుర్తించిన ఎస్ఈబీ పోలీసులు అతన్ని స్టేషన్ కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రాసెస్ పూర్తి చేశారు.అయితే.. నిందితుడు మాత్రం సంతకం చేసేందుకు ససేమిరా అన్న వైనం షాకింగ్ గా మారింది. ఇక్కడితో ఈ సీన్ ఆగలేదు. పుల్లయ్యను అరెస్టు చేశారన్న సమాచారం అందుకున్నంతనే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాచమల్లు స్టేషన్ కు వెళ్లారు.

తన అనుచరులతో స్టేషన్ కు వెళ్లిన ఆయన.. ఎస్ఐను నిలబెట్టి.. తాను కుర్చీలో కూర్చుండి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రూల్ ప్రకారం ఒక్కో వ్యక్తి వద్ద మూడు మద్యం బాటిళ్ల కంటే ఎక్కువ ఉండకూడదని ఎస్ఐ అలీ బేగ్ వివరించగా.. తనకు సంబంధం లేదన్న ఎమ్మెల్యే.. ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి ఇద్దరు.. ముగ్గురికి చెందిన మద్యం సీసాల్ని ఒక వ్యక్తి తీసుకెళ్లటం నేరమా? అంటూ ప్రశ్నించారు.

ఒక వ్యక్తి తన కుటుంబంలో ఎవరైనా చనిపోయి.. కర్మకాండలు చేసుకుంటూ మద్యం సీసాల్ని తీసుకెళ్లటం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించిన ఆయన.. పేదల్ని పట్టుకొని పీడిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆగ్రహానికి కాస్తంత తగ్గిన ఎస్ఐ.. తాము ఎవరినీ బాధ పెట్టలేదని చెప్పగా.. కేసు రాస్తే ఊరుకోనని తేల్చేశారు ఎమ్మెల్యే. ఈసందర్భంగా ఎస్పీకి చెప్పాల్సి ఉంటుందన్న ఎస్ఐ మాటలకు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఎస్పీకి చెప్పుకుంటావో వాళ్ల బాబుకు చెప్పుకుంటావో కానీ కేసు మాత్రం కడితే ఒప్పుకోనని చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి.

అక్కడితో ఆగని ఎమ్మెల్యే రాచమల్లు.. స్టేషన్ లోనే మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ సంపాదనకు అలవాటు పడిన అధికారులు.. నెల మామూళ్లు తీసుకుంటూ పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని పట్టుకొస్తున్నా పట్టించుకోవటం లేదంటూ తీవ్రమైన ఆరోపణల్ని చేయటం గమనార్హం. పేదలు ఆరు మద్యం సీసాలు పట్టుకెళ్లటం నేరమంటూ రోజూ కేసులుపెడుతున్నారని.. ఇలాంటి వారి మీద చర్యలుతీసుకోవాలంటూ డిమాండ్ చేయటం గమనార్హం. మొత్తంగా.. ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలు అధికారుల్లో తీవ్ర చర్చకు తెర తీశాయి.