''జగన్ గారూ.. నా జోలికి రావొద్దు'' ఇది వార్నింగేనా.. శివాజీ?
మాజీ సీఎం జగన్మోహనరెడ్డి, ఆయన అభిమానులను తీవ్రంగా హెచ్చరిస్తూ సినీనటుడు శివాజీ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By: Tupaki Political Desk | 9 March 2026 10:17 PM ISTమాజీ సీఎం జగన్మోహనరెడ్డి, ఆయన అభిమానులను తీవ్రంగా హెచ్చరిస్తూ సినీనటుడు శివాజీ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయంగా తనను టార్గెట్ చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తన సినిమా విడుదల కాకముందే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన బతుకు దెరువును దెబ్బతీయాలని చూస్తున్నారని శివాజీ మండిపడుతున్నారు. తాను ఇలాంటి పనుల వల్ల భయపడనని, మీరు (వైసీపీ కార్యకర్తలు) ఇలానే చేయాలని అనుకుంటే ఇకపై రోజూ తాను మాట్లాడతానని, సీబీఐ కేసులపై ప్రతి రోజు ప్రధాని మోదీని అడుగుతానని శివాజీ వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యకర్తలను తీవ్రస్థాయిలో హెచ్చరిస్తూ శివాజీ చేసిన కామెంట్స్ పై సినీ, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
వైసీపీ కార్యకర్తలను పేటీఎం బ్యాచ్ అంటూ విమర్శించిన శివాజీ, మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరును ప్రస్తావిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, అమరావతి రైతులకు మద్దతుగా పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బంది కలిగించే పార్టీ ఏదైనా తన పోరాటం ఆగదని ప్రకటించారు. రూ.వెయ్యి, రెండు వేల చిల్లర డబ్బు కోసం భావితరాల భవిష్యత్తుతో ఆడుకుంటారా? అంటూ శివాజీ మండిపడ్డారు. అసలు బుద్ధి ఉందా? మీకు అంటూ ప్రశ్నించిన శివాజీ ‘‘ఇకపై రోజూ మాట్లాడుకుందాం... మీ నాయకుడి గురించి, మీ పేటీఎం గాళ్ల గురించి మాట్లాడుకుందామా?’’ అంటూ సవాల్ విసిరారు. ‘‘ఇప్పటివరకు సైలెంటుగా ఉన్నా, నా బతుకు వరకు వస్తారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాకు ఎందుకులే అని నా సినిమాలు చేసుకుంటున్నాను, కానీ నన్ను అనవసరంగా కెలుకుతున్నారంటూ శివాజీ వ్యాఖ్యానించారు. ‘‘సినిమా రిలీజ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ మీ అందరికి ఇబ్బంది పెట్టిందా? అంటూ ప్రశ్నించారు. నేనెప్పుడూ అలాగే మాట్లాడతా గురూ.., ఎవడికీ భయపడను.. మీలా ఎవడో ఇచ్చే డబ్బు కోసం కక్కుర్తి పడనంటూ స్పష్టం చేశారు. ‘‘నా బతుకు నడిస్తే చాలు అనుకునే రకం కాదు. ఈ బతుకు ఇచ్చింది జనం.. వారి కోసమే మాట్లాడతా అంటూ శివాజీ తెగేసి చెప్పారు. ‘‘మీ పేటీఎం గాళ్లు ఈ సినిమాను ఆపగలరేమో.. శివాజీని కాదు అంటూ సవాల్ విసిరారు.
పేటీఎం బ్యాచ్ నన్ను తగులుకుందామంటే మీ వాడికే ప్రమాదం గుర్తుపెట్టుకోండి అంటూ శివాజీ హెచ్చరించారు. ‘‘నేను జనం కోసం బతుకుతా. జనం డబ్బులు కోసం కాదు. వద్దు గురు.. నా జోలికి రావొద్దు. నాకు రాజకీయాలు వద్దు’’ అంటూ శివాజీ వ్యాఖ్యానించారు. ఇటీవల వరుస సినిమాలు చేస్తున్న శివాజీని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు టార్గెట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శివాజీ సినిమాలకు నెగిటివ్ రివ్యూలు, కామెంట్లు చేస్తూ ఆర్థికంగా దెబ్బకొట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తాజాగా ఇంకా విడుదలకాని సినిమాపై నెగిటివ్ కామెంట్లు చేయడాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ లో సినిమా రివ్యూలు రాసేవారికి డబ్బులిచ్చి తన సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని శివాజీ ఆరోపిస్తున్నారు. దీనికి ఉదాహరణగా లక్ష మంది ఫాలోవర్లు ఉన్న ఓ క్రియేటర్ కూడా తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని, అతడిపై ఫిర్యాదు చేద్దామని భావించినా, పోనీలే చిన్నోళ్లు, డబ్బు కోసం కక్కుర్తి పడ్డారని వదిలేశానని శివాజీ వ్యాఖ్యానించారు. ఇక శివాజీ వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియా ఎలా రియాక్ట్ అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. శివాజీ నేరుగా మాజీ సీఎం జగన్, ఆయన అభిమానులపైనే వాగ్బాణాలు సంధించడంతో శివాజీ సినిమా హైప్ పెరిగిందని అంటున్నారు.
