Begin typing your search above and press return to search.

రియ‌ల్ట‌ర్ల‌తో కుమ్మ‌క్కు.. బినామీల‌తో బొక్కుడు.. ఇదీ ఆ అధికారి అవినీతి లీల‌!

ఒక శాఖ‌, లేదా విభాగానికి నేతృత్వం వ‌హించే స్థానంలో ఉన్న అధికారి త‌ప్పించుకోలేర‌ని.. ఇలాంటి గిమ్మింకుల‌తో న్యాయ‌వ్య‌వ‌స్థ క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టలేర‌ని వ్యాఖ్యానించింది

By:  Tupaki Desk   |   16 Feb 2024 3:30 PM GMT
రియ‌ల్ట‌ర్ల‌తో కుమ్మ‌క్కు.. బినామీల‌తో బొక్కుడు.. ఇదీ ఆ అధికారి అవినీతి లీల‌!
X

''అవినీతి నేరుగా చేయ‌లేదు. ఆయ‌న‌కు తెలియ‌కుండానే.. ఆఫీసులో ఉన్న స‌మాచారం బ‌య‌ట‌కు పొక్కింది.. కాబ‌ట్టి ఆయ‌న‌కు ఈ పాపం అంట‌దు!'' - అని రాజ‌స్తాన్‌.. రెవెన్యూ విభాగం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అవినీతి కేసులో సాక్షాత్తూ.. ప్ర‌భుత్వ‌మే వాద‌న‌లు వినిపించింది. ఇది 2002 నాటి కేసు. అయితే.. అప్పట్లో దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ఒక శాఖ‌, లేదా విభాగానికి నేతృత్వం వ‌హించే స్థానంలో ఉన్న అధికారి త‌ప్పించుకోలేర‌ని.. ఇలాంటి గిమ్మింకుల‌తో న్యాయ‌వ్య‌వ‌స్థ క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టలేర‌ని వ్యాఖ్యానించింది.

అచ్చం.. ఇప్పుడు ఇలాంటి కేసే.. తెలంగాణ‌లోనూ వెలుగు చూసింది. తాజాగా హైద‌రాబాద్ మెట్రో డెవ‌ల‌ప్‌మెంట్ అధారిటీ మాజీ డైరెక్ట‌ర్ శివ‌బాల‌కృష్ణ కేసులోనూ న్యాయ‌వాదులు ఇదే వాద‌న‌ను వినిపిస్తున్నారు. ఆయ‌న‌కు తెలియ‌కుండానే స‌మాచారం..(ఎక్క‌డెక్క‌డ ప్ర‌భుత్వం భూములు వేలం వేస్తోంది.. ఎంతెంత‌కు పాడొచ్చు) బ‌య‌ట‌కు వెళ్లిపోయింద‌నే వాద‌న తెర‌మీదికి తెచ్చారు. కానీ, ఇది న్యాయ స్థానం ముందు నిలిచేది కాద‌ని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే..

+ శివబాలకృష్ణ అవినీతి వ్యవహారంలో ఏసీబీ అన్ని వైపుల నుంచి స‌మాచారం సేక‌రిస్తోంది. హెచ్ఎండిఏ లో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగాయని, సత్యనారాయణ, భరత్‌ ఇద్దరు శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్నార‌ని, అనేక భూములు, స్థలాలు వారిద్దరి పేరు మీద ఉన్నట్టు తేల్చారు.

+ వేలానికి ముందే పలువురు రియాల్టర్లకు అధికారులు సమాచారం చేరవేశారు. వారికే భూములు దక్కేలా వ్య‌వ‌హ‌రించారు.

+ వేలంపాట సమయంలో శివ బాలకృష్ణ హెచ్ఎండీఏలో పనిచేస్తున్నారు. భూములు వేలంతో పాటు ప్రాజెక్టుల వివరాలని రియల్టర్లకు చేరవేశారు.

+ శివబాలకృష్ణకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ సిద్ధమైంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే శివ‌బాల కృష్ణ ఎట్టి ప‌రిస్థితిలోనూ త‌ప్పించుకోలేర‌ని అంటున్నారు న్యాయ‌నిపుణులు.