Begin typing your search above and press return to search.

పాలిటిక్స్ లో చెల్లెళ్లు.. చిక్కులు.. చింతలు.. చిద్విలాసాలు

పార్టీలు సైతం ఇదే తరహా ధోరణని ప్రోత్సహిస్తున్నాయి. ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనే పరిస్థితి లేకుండా పోయింది

By:  Tupaki Desk   |   19 April 2024 10:23 AM GMT
పాలిటిక్స్ లో చెల్లెళ్లు.. చిక్కులు.. చింతలు.. చిద్విలాసాలు
X

‘‘రాజకీయాలు ఒకప్పటిలా లేవు’’ పాతతరం నాయకులు పెదవి విరస్తూ చెప్పే మాటలు. ఇప్పటి రాజకీయాలు ఇలానే ఉంటాయి అనేది నవతరం ఇస్తున్న జవాబు. దేని కాలం దానిదే అనేది మధ్యే మార్గంగా వచ్చే సమాధానం. మొత్తమ్మీద అప్పటికి, ఇప్పటికి వచ్చిన మార్పు ఏమిటంటే.. రాజకీయాల్లో వారసత్వం. నాయకుడి కుమారుడు నాయకుడే కావాలనేంతగా పరిస్థితులు మారాయి. పార్టీలు సైతం ఇదే తరహా ధోరణని ప్రోత్సహిస్తున్నాయి. ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనే పరిస్థితి లేకుండా పోయింది.

అన్నా చెల్లెళ్లు.. సవాళ్లు

ప్రస్తుత లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాజకీయాల్లో అన్నాచెల్లెళ్ల సవాళ్లు పలు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీలో సీఎం వైఎస్ జగన్ పాలనను విమర్శిస్తూ ఆయన సొంత చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తావిస్తూ ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సైతం షర్మిలతో గొంతు కలుపుతున్నారు. షర్మిల కడప ఎంపీగా బరిలో ఉండడంతో వీరిద్దరూ కలిసి ప్రజల్లోకి వెళ్తూ.. అన్న జగన్ ను నిలదీస్తున్నారు.

అన్నతో కాదు.. వదినతో ఢీ

మహారాష్ట్రలో శరద్ పవార్ కుటుంబానిది 50 ఏళ్ల రాజకీయ చరిత్ర. అలాంటి కుటుంబంలో ఏడాది కిందట చీలిక వచ్చింది. శరద్ పవార్ ఎన్సీపీని చీల్చి బీజేపీ-శివసేన (శిందే) కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అజిత్ పవార్. సొంత అన్న కుమారుడే ఇలా చేసేసరికి శరద్ పవార్ ఖిన్నుడయ్యారు. అయినా రాజకీయాల్లో వెనుకడుగు వేయడం లేదు. మరోవైపు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తమ కుటుంబ నియోజకవర్గమైన బారామతి నుంచి ఎంపీగా పోటీచేస్తున్నారు. అయితే ,ఆమె ఢీకొడుతున్నది ఎవరినో కాదు.. అన్న అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ను. ఇప్పటికే ఓసారి తండ్రి శరద్ పవార్ ను నిందించిన అన్న అజిత్ ను సుప్రియా తీవ్రంగా విమర్శించారు. వారి మధ్య మాటలు లేవు కానీ.. మాటల యుద్ధం తరచూ జరిగింది. ఇప్పుడు ఏకంగా ఎన్నికల క్షేత్రంలోనే తలపడుతున్నారు.

చెల్లెలు జైలులో.. అన్న పోరులో

తెలంగాణలో పరిస్థితి కాస్త భిన్నం. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చెందకుంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేసేవారేమో..? కానీ, ఆమె ఇప్పడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో తిహాడ్ జైలులో ఉన్నారు. మరోవైపు కవిత అన్న కేటీఆర్ చెల్లెలును ఈడీ అరెస్టు చేసిన రోజే నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికి పలుసార్లు ములాఖత్ అయ్యారు. ఓవైపు తెలంగాణలో ఎంపీ ఎన్నికల బాధ్యతలు చూస్తూనే మరోవైపు చెల్లెలు బాగోగులను పట్టించుకుంటున్నారు కేటీఆర్.

స్టాలిన్ కు బెంగలేదు..

తమిళనాడులో కరుణానిధి జీవించి ఉన్నప్పుడు డీఎంకేలో ఆయన కుమారులు స్టాలిన్-అళగిరి మధ్య తీవ్ర విభేదాలు, రాజకీయ వారసత్వం కోసం పోటీ ఉండేది. ఇప్పుడు అళగిరి సందడే లేదు. అయితే, స్టాలిన్ చెల్లెలు కనిమొళి మాత్రం ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ అన్నాచెల్లెళ్ల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. అన్నట్లు 2జి కేసులో కనిమొళి ఒకప్పుడు ఢిల్లీలో జైలు శిక్ష అనుభవించారు.

అనురాగం.. రాహుల్-ప్రియాంక

రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత అనురాగంతో ఉన్న అన్నాచెల్లెళ్లు ఎవరంటే కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ-ప్రియాంకా గాంధీలే. అధికారం వీరికి కొత్త కాకపోయినా.. అది ఇద్దరి మధ్యన ఏమాత్రం దూరం పెంచలేదు. తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయిన ఈ అన్నాచెల్లెళ్ల ఎంత అనుబంధం ఉందో తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రజలంతా చూశారు. ప్రస్తుత ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెదక్, ఖమ్మంలో ప్రియాంక పోటీ చేస్తారనే ప్రచారమూ జరిగింది. రాహుల్ సైతం ఖమ్మంలో బరిలో దిగుతారనే కథనాలు వచ్చాయి. ఇవేవీ నిర్ధారణ కాలేదు. ఇదీ రాజకీయాల్లో అన్నాచెల్లెళ్ల కథ.