Begin typing your search above and press return to search.

బైక్ పై సోదరి మృతదేహం... నడుముకు చున్నీ కట్టుకుని ప్రయాణం!

మరణించిన సోదరి మృతదేహాన్ని బైక్ పై నడుముకు కట్టుకుని వెనుక సపోర్ట్ గా మరో సోదరిని కూర్చోబెట్టుకుని ప్రయాణించిన ఒక దారుణ సంఘటన

By:  Tupaki Desk   |   8 Nov 2023 10:31 AM GMT
బైక్  పై సోదరి మృతదేహం... నడుముకు చున్నీ కట్టుకుని ప్రయాణం!
X

మరణించిన సోదరి మృతదేహాన్ని బైక్ పై నడుముకు కట్టుకుని వెనుక సపోర్ట్ గా మరో సోదరిని కూర్చోబెట్టుకుని ప్రయాణించిన ఒక దారుణ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హృదయాలు ద్రవించిపోయేలా ఉన్న ఈ సంఘటన చూసినవారితో కంటతడి పెట్టించింది. ఆ జిల్లాల్లో కేవలం రెండే అంబులెన్సులు ఉండటం దానికి ప్రధాన కారణం అని తెలుస్తుంది.

అవును... భారతదేశం వెలిగిపోతుంది.. దూసుకుపోతుంది.. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపే చూస్తున్నాయి అని చెప్పుకుంటున్న దశలో ఇప్పటికీ ఎన్నో దారుణమైన ఘటనలు దర్శనమిస్తూనే ఉన్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు ఇలా కనిపించడం పాలకుల విజన్ ను కళ్లకు కట్టినట్లు చూపెడుతున్నాయని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఔరయ్య జిల్లాలో ఒక దారుణం చోటు చేసుకుంది. అక్కడ ఆరోగ్య సేవల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో చెప్పే సంఘటన తాజాగా తెరపైకి వచ్చింది. నవీన్ బస్తీ వెస్ట్‌ లో నివాసం ఉంటున్న అంజలి (20) పొరపాటున బకెట్‌ లో ఆన్ చేసి ఉన్న వాటర్‌ హీటర్‌ ను ముట్టుకుని విద్యుదాఘానికి గురైంది. దీంతో వెంటనే అపస్మారక స్థితికి చేరుకుంది.

దీంతో ఆ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించారు. ఇందులో భాగంగా సమీపంలోని కమ్యునిటీ హెల్త్ సెంటర్ కి ఆమెను తరలించారు. దీంతో అంజలి ని పరీక్షించిన అక్కడి వైద్యులు.. అప్పటికే ఆమె చనిపోయిందని నిర్ధారించారు. దీంతో తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ సోదరి మృతదేహాన్ని ఇంటికి తరలించే ప్రయత్నం చేశారు.

అయితే ఆ సమయంలో అంజలి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అందుబాటులో ఎలాంటి వాహనం లేదు. దీంతో మృతురాలి సోదరుడు ఎవరూ ఊహించని సాహసం చేశాడు. అందులో భాగంగా... ఆ మృతదేహాన్ని బైక్‌ పై ఉంచి, దానిని చున్నీతో తన నడుముకు కట్టుకున్నాడు. ఆ సమయంలో ఆ మృతదేహానికి వెనుకగా మరో సోదరిని కూర్చోబెట్టుకుని బైక్‌ ను ఇంటివైపు నడిపాడు.

ఆ సమయంలో వీరి పరిస్థితిని చూసి కూడా ఆసుపత్రి సిబ్బంది తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఉదంతం గురించి కమ్యునిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్‌ స్పందించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహనం కావాలని తమను అడిగితే, ఏర్పాటు చేసేవారమని చెప్పుకొచ్చారు. అదే సమయంలో జిల్లాలో రెండు అంబులెన్సులు మాత్రమే ఉన్నాయని చెప్పారని తెలుస్తుంది. దీంతో ఈ సంఘటనపై ప్రభుత్వమీద తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి!