తీవ్ర ఒత్తిడిలో బీజేపీ.. ఈసీ వివాదంలో విపక్షాలదే పైచేయి?
గడిచిన 12 ఏళ్లుగా కేంద్రంలో అప్రతిహత అధికారాన్ని చలాయిస్తున్న బీజేపీ ఎన్నడూలేనట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 2 Oct 2026 9:00 PM ISTగడిచిన 12 ఏళ్లుగా కేంద్రంలో అప్రతిహత అధికారాన్ని చలాయిస్తున్న బీజేపీ ఎన్నడూలేనట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ఈసీ వైఖరిని ప్రశ్నిస్తూ విపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలను తిప్పికొట్టడంలో బీజేపీ పెద్దలు తడబడుతున్నట్లు ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీకి ఏజెంటులా పనిచేస్తున్నారని విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుండగా, అధికార పార్టీ నుంచి ఆ స్థాయిలో ప్రతిఘటన కనిపించడం లేదని అంటున్నారు. కేవలం ఎన్నికల సంఘంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమని చెప్పడమే కాకుండా, ప్రజాస్వామ్య మూల సూత్రం కూడా ఇదే చెబుతోందన్న బీజేపీ వాదన తేలిపోతోందని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో బీజేపీ ఆత్మరక్షణలోకి వెళ్లిపోతోందా? అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. అదే సమయంలో ప్రతిపక్షాలు అన్నీ కూడా చేతులు కలపడంతో కేంద్రం ఊపిరిపీల్చుకోలేని విధంగా పరిస్థితులు తయారవుతున్నాయని అంటున్నారు. సర్ పేరుతో భారీగా ఓట్లు తొలగిస్తున్నారని, ఆ విధంగా ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునేలా బీజేపీ కుట్ర చేస్తుందని విపక్షాలు చేస్తున్న ప్రచారం ప్రజల్లోకి వెళితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. పుష్కర కాలంగా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై సహజంగా వచ్చే ప్రజావ్యతిరేకతకు ఇది తోడైతే ఊహకు అందని ఫలితాలు ఎదుర్కోవాల్సివస్తుందని అంటున్నారు. దీంతో ఈ పరిస్థితిని బీజేపీ ఎలా అధిగమిస్తుందనేది ఆసక్తి రేపుతోందని అంటున్నారు.
ఏకమవుతున్న విపక్షాలు
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తోపాటు సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు విపక్షాలు పిలుపునిచ్చాయి. దీనికి జెన్ జీ ఉద్యమకారులైన కాక్రోచ్ పార్టీ కూడా గొంతు కలపడంతో ఆందోళనలు ఎంతవరకు వెళతాయనే ఉత్కంఠ పెంచుతున్నాయి. విపక్షాలు, సీజేపీ కార్యకర్తలు వేర్వేరుగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించినప్పటికీ ఇద్దరి లక్ష్యలు ఒకటే కావడంతో ఎప్పుడైనా చేతులు కలిపే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే యువతలో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు కూడా భయపడుతున్నారని అంటున్నారు. ఇప్పటికే సీజేపీ ఉద్యమం కారణంగా కేంద్ర మంత్రి ఒకరు రాజీనామా చేయాల్సివచ్చిందని, ఇప్పుడు ఈసీ రాజీనామాతోపాటు ప్రధాని కూడా దిగిపోవాలంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేయడాన్ని తేలిగ్గా తీసుకోడానికి వీలు లేదని అంటున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని విపక్ష పార్టీలు అన్నీ ఏకమైతే దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియపై అనుమానాలు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. కేంద్రం ఈ విషయాన్ని వెంటనే చక్కదిద్దుకుని రాజకీయంగా నష్టం లేకుండా చూసుకోవాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
వరుస ఎన్నికల భయం
ప్రస్తుత రాజకీయ పరిణామాలతో బీజేపీలో తీవ్రమైన అంతర్మథనం జరుగుతోందని అంటున్నారు. ఎన్నికల కమిషన్ లో విభేదాలపై జాతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారం, విపక్షాల విమర్శలను ప్రజలు నమ్మితే చాలా నష్టపోవాల్సివస్తుందని ఆ పార్టీ నేతలు అంతర్గత సంభాషణల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మ్యాజిక్ చేస్తారని ఎక్కువ మంది నేతలు నమ్మకం పెట్టుకున్నారని కూడా అంటున్నారు. ఎన్నో విపత్కర పరిస్థితుల నుంచి సునాయాశంగా బయటపడిన చాణక్యం మోదీ, షాకి ఉందని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితులు చక్కబడతాయని ఎక్కువ మంది ధీమాగా ఉన్నారు. అయితే మరో ఆరు నెలల్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, అక్కడికి ఆరు నెలలో జరిగే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను తలచుకుని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. మరోవైపు 2028లో ఏకంగా 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం కూడా బీజేపీని ఒత్తిడికి గురిచేస్తోందని అంటున్నారు. అందుకే విపక్షాల విమర్శలపై ఆచితూచి మాట్లాడాలని ఆ పార్టీ చూస్తోందని భావిస్తున్నారు.
