ఉన్నపలంగా కారును మింగేసిన రోడ్డు.. షాకింగ్ వీడియో!
అవును... టాంజోంగ్ కటాంగ్ రోడ్ సౌత్, మౌంట్ బాటెన్ రోడ్ జంక్షన్ వద్ద ఒక పెద్ద సింక్ హోల్ తెరుచుకుంది.
By: Tupaki Desk | 28 July 2025 9:36 AM ISTరోడ్డుపై వెళ్తున్న కారు ఉన్నపలంగా కిందకు పడిపోతే ఎలా ఉంటుంది? అప్పటివరకూ నార్మల్ గా ఉన్న రోడ్డు ఒక్కసారిగా పెద్ద లోయలా కుంగిపోయి, కారును మింగేస్తే ఆ దృశ్యం, ఆ సంఘటన ఏ స్థాయిలో ఉంటుంది? తాజాగా ఇలాంటి ఘటనే సింగపూర్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అవును... టాంజోంగ్ కటాంగ్ రోడ్ సౌత్, మౌంట్ బాటెన్ రోడ్ జంక్షన్ వద్ద ఒక పెద్ద సింక్ హోల్ తెరుచుకుంది. ఇది ఒక బ్లాక్ కారును ఉన్నపలంగా మింగివేసింది. దీంతో... నిత్యం రద్దీగా ఉండే రహదారిలో కొంత భాగాన్ని మూసివేయవలసి వచ్చింది. ఈ ఘటనలో ఆ కారు నడుపుతున్న మహిళకు గాయాలైనట్లు చెబుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు!
సింగపూర్ నేషనల్ వాటర్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ సంఘటన శనివారం సాయంత్రం 5:50 గంటలకు జరిగింది. ఈ సందర్భంగా... ఆన్ లైన్ లో ప్రసారం అవుతున్న డాష్ క్యామ్ ఫుటేజ్ లో రోడ్డు అకస్మాత్తుగా లోయలోకి కృంగిపోయింది.. దీంతో, ఒక వాహనం ఆ లోతైన రంధ్రంలో పడిపోయింది. దీంతో.. సమీపంలోని కార్మికులు వెంటనే స్పందించారు.
ఈ సందర్భంగా తాడును ఉపయోగించి ఆ కారులోని మహిళా డ్రైవర్ ను బయటకు తీశారు. ఈ సమయంలో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ (ఎస్.సీ.డీ.ఎఫ్) అధికారులు.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉందని.. వైద్య పరీక్షలు జరుగుతున్నాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలో... ఆదివారం మధ్యాహ్నం క్రేన్ సహాయంతో కారును సింక్ హోల్ నుండి బయటకు తీశారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన ల్యాండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ... ఆ రహదారి తదుపరి నోటీసు వచ్చేవరకు మూసివేయబడిందని వెల్లడించింది.
