Begin typing your search above and press return to search.

సింగరేణి ఎవరిది? హోరాహోరీ పోరులో గెలిచిందెవరు?

సాధారణ ఎన్నికల మాదిరి హోరాహోరీగా సాగిన సింగరేణి బొగ్గుగనుల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎర్రజెండా రెపరెపలాడింది.

By:  Tupaki Desk   |   28 Dec 2023 5:40 AM GMT
సింగరేణి ఎవరిది? హోరాహోరీ పోరులో గెలిచిందెవరు?
X

సాధారణ ఎన్నికల మాదిరి హోరాహోరీగా సాగిన సింగరేణి బొగ్గుగనుల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎర్రజెండా రెపరెపలాడింది. చివరి వరకు ఉత్కంటగా సాగిన ఓట్ల లెక్కింపులో స్వల్ప అధిక్యతతో సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీకి పట్టం కడుతూ కార్మికులు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత వరకు సాగిన ఓట్ల లెక్కింపు అనంతరం.. కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంస్థ కంటే కమ్యునిస్టు పార్టీకి చెందిన అనుబంధ సంస్థ అధిక్యతను ప్రదర్శించింది. దీంతో.. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధ సంస్థ) కార్మికులు తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మందమర్రి.. బెల్లంపల్లి.. శ్రీరాంపూర్ డివిజన్లలో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోల్ బెల్ట ప్రాంతమైన రామగుండం 1, రామగుండం 2 డివిజన్లలో ఏఐటీయూసీ విజయం సాధించింది. దీంతో ఇప్పటివరకు సింగరేణి కాలరీస్ లో ఏడోసారి జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలుపొందింది. అయితే.. ఈ సంస్థకు గట్టి పోటీని ఇచ్చిన కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీ కొత్తగూడెం కార్పొరేట్.. కొత్తగూడెం.. మణుగూరు.. ఇల్లెందు.. రామగుండం 3, భూపాలపల్లలి డివిజన్లలో విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలోని మొత్తం నాలుగు డివిజన్లలోనూ ఈ సంఘం క్లీన్ స్వీప్ చేసింది.

మొత్తంగా మూడు వేల ఓట్ల అధిక్యంతో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఈ గెలుపులో శ్రీరాంపూర్ డివిజన్ కీలకభూమిక పోషించింది. ఎందుకంటే.. ఆ ఒక్క డివిజన్ లోనే ఏఐటీయూసీకి 2166 ఓట్ల మెజార్టీ లభించింది. సింగరేణి చరిత్రలో గుర్తింపు సంఘంగా ఎన్నిక కావటం ఏఐటీయూసీకు ఇది నాలుగోసారి. ఈ మధ్యన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్ట్ లోని 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్.. సీపీఐ కలిసి పోటీ చేయగా.. సింగరేణి ఎన్నికల్లో ఈ రెండు పోటీపడ్డాయి. చివరకు కమ్యునిస్టుల అధిక్యత నెలకొంది.

బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగ్గా.. మొత్తం 39,773 మంది 37,458 మంది కార్మికులు అంటే 94.15 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే 0.78 శాతం పోలింగ్ తగ్గింది. స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చెందిన అనుబంధ కార్మిక సంఘం కనుమరుగైంది. 2012, 2017లో వరుస విజయాలు సాధించిన ఈ పార్టీ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలుకావటంతో ఎన్నికల్లో వెనక్కి తగ్గింది. ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసినప్పటికీ.. అధిష్ఠానం పోటీకి ఆసక్తి చూపలేదు. పార్టీపై పలువురు నేతలు ఒత్తిడి తెచ్చినా కాదని తేల్చేయటంతో.. ఈ పార్టీకి చెందిన పలువురు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీంతో.. ఎన్నికల్లో గనుల వద్ద ఎక్కడా గులాబీ జెండా ఎగరలేదు.