Begin typing your search above and press return to search.

సింగరేణికి స్వర్ణ కాంతులు

తాజాగా సింగరేణి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం సంస్థ భవిష్యత్ ను ఉజ్వలంగా మార్చబోతున్నది. తరతరాలుగా తరగని నల్ల బంగారం అందిస్తున్న సింగరేణి మరో మైలు రాయిని చేరుకోబోతున్నది.

By:  Tupaki Desk   |   20 Aug 2025 1:00 PM IST
సింగరేణికి స్వర్ణ కాంతులు
X

మూడు తరాల కార్మికుల చెమట బిందువులకు ప్రత్యక్ష నిదర్శనం సింగరేణి గనులు. దాదాపు 133 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వందల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతన్నది. ఉభయ తెలుగు రాష్ర్టాలతో పాటు దేశానికి వెలుగులు పంచుతున్నది సింగరేణి. తాజాగా సింగరేణి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం సంస్థ భవిష్యత్ ను ఉజ్వలంగా మార్చబోతున్నది. తరతరాలుగా తరగని నల్ల బంగారం అందిస్తున్న సింగరేణి మరో మైలు రాయిని చేరుకోబోతున్నది.

ఖనిజాల అన్వేషణలో..

ఇప్పటి వరకు బొగ్గు మైనింగ్‌కే పరిమితమైన ఈ సంస్థ, తొలిసారిగా కీలక ఖనిజాల రంగంలో అడుగుపెట్టింది. కర్ణాటకలోని దేవదుర్గ్ బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్‌ను ఆన్లైన్ వేలంలో సింగరేణి సాధించడం విశేషంగా నిలిచింది. ఈ లైసెన్స్ సాధించడం సింగరేణికి కేవలం ఒక అవకాశమే కాకుండా, భవిష్యత్తులో నిరంతర లాభాలను తెచ్చిపెట్టే బంగారు అడుగుగా భావిస్తున్నారు.

మూడు రాష్ట్రాల్లో అడుగుపెట్టిన సింగరేణి

కేంద్ర ప్రభుత్వం మార్చి 13న కీలక ఖనిజాల లైసెన్సుల కోసం వేలం మొదలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనతో సింగరేణి కూడా ఈ వేలంలోకి దిగింది. నిపుణుల బృందం అధ్యయనం అనంతరం మధ్యప్రదేశ్‌లోని పదార్ ప్లాటినమ్ గ్రూప్ ఎలిమెంట్స్ బ్లాక్, ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగిరి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ బ్లాక్, కర్ణాటక దేవదుర్గ్ బంగారం, రాగి బ్లాక్‌లను అనుకూలంగా గుర్తించింది. ఈ నెల 13, 14, 19 తేదీల్లో జరిగిన వేలాల్లో, చివరకు ఆగస్టు 19న దేవదుర్గ్ బ్లాక్‌ను సింగరేణి సాధించడం విశేషం.

ఐదేండ్లు.. 90 కోట్లు..

సింగరేణి సంస్థ 37.75 శాతం రాయల్టీ కోట్ చేసింది. దీంతో వేలంలో సింగరేణి ఎల్-1 బిడ్డర్‌గా నిలవడం విశేషం. ఇది సంస్థ చరిత్రలో మరో మైలురాయి. రాబోయే ఐదేళ్లలో అన్వేషణ పూర్తవుతుంది. ఈ పనులకు దాదాపు 90 కోట్ల ఖర్చు అవుతుంది. అందులో 20 కోట్లను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వనుంది. అనంతరం కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాతే మైనింగ్ హక్కుల వేలం ఉంటుంది. వేలంలో మైనింగ్ హక్కులు ఎవరు దక్కించుకున్నా సింగరేణి సంస్థకు ఆ బ్లాక్ నుంచి వచ్చే రాయల్టీలో 37.75 శాతం లైఫ్ లాంగ్ చెల్లించాల్సి ఉంటుంది.

సింగరేణికి లాభాలు ఏంటి?

ఈ లైసెన్స్ ద్వారా సింగరేణి భవిష్యత్ కు ఆదాయ వనరులు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటి వరకు బొగ్గు ఆధారంగా ఉన్న సింగరేణి, బంగారం, రాగి వంటి ఖనిజాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. రాయల్టీ రూపంలో నిరంతరంగా వచ్చే ఆదాయం సింగరేణి ఆర్థిక స్థితిని బలపరచనుంది. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా సింగరేణి తన స్థానాన్ని స్థిరపరుచుకోగలదు.