సింగరేణి కార్మికులకు బోనస్ బొనాంజా.. కాంట్రాక్టు వారికీ దసరానే
దసరాను పురస్కరించుకుని సింగరేణి కార్మికులకు లాభాల్లో 43 శాతం బోనస్ ను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
By: Tupaki Desk | 22 Sept 2025 3:02 PM ISTతెలంగాణకు మణిహారం సింగరేణి..! ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ గళమెత్తారు గని కార్మికులు..! అంతేకాదు.. కోల్ బెల్ట్ రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటుంది.. అందుకే సింగరేణి కార్మికులను ప్రభుత్వాలు ఎప్పుడూ కీలకంగానే చూస్తుంటాయి.... తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరింత ఆకర్షణీయమైన బోనస్ ప్రకటించింది. తెలంగాణలో పెద్ద పండుగ దసరా... బతుకమ్మతో మొదలయ్యే సంబరాలు విజయదశమి (దసరా)తో పూర్తవుతాయి.. పండుగతో కలిపి మొత్తం 12 రోజులు జరుగుతాయి. ఈ పండుగకే వివిధ ప్రయివేటు సంస్థలు కూడా బోనస్ ప్రకటిస్తుంటాయి. తాజాగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా బొనాంజా ఇచ్చింది.
లాభాల్లో 34 శాతం...
దసరాను పురస్కరించుకుని సింగరేణి కార్మికులకు లాభాల్లో 43 శాతం బోనస్ ను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ వివరాలను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. ఈ బోనస్ ఎంత ఉంటుందో తెలుసా..? ఏకంగా ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 అందనుంది. హైదరాబాద్ లో మంత్రులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ వివరాలు ప్రకటించారు. ఈసారి సింగరేణిలోని కాంట్రాక్టు కార్మికులకూ బోనస్ బోనస్ ఇస్తున్నామని భట్టి తెలిపారు. దేశ చరిత్రలో ఇలా కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.
41 వేల మంది కార్మికులు..
సింగరేణిలో 41 వేల మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. వీరికి దసరా బోనస్ కింద రూ.819 కోట్లు అందించనున్నారు. ఇక 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 చొప్పున ఇవ్వనున్నారు. కాగా, దీపావళికి కూడా సింగరేణి కార్మికులకు బోనస్ అందుతుంది. అదెలాగంటే.. కోల్ ఇండియా నుంచి వచ్చే మొత్తాన్ని దీపావళి సందర్భంగా పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడిస్తూ... మున్ముందు కూడా సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
