Begin typing your search above and press return to search.

గాలి బస్సులో భారీ కుదుపులు... ఏమిటీ, ఎందుకు?

తాజాగా సింగపుర్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం సుమారు 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ఉన్నపలంగా కుదుపులకు లోనైంది.

By:  Tupaki Desk   |   23 May 2024 6:33 AM GMT
గాలి బస్సులో భారీ కుదుపులు... ఏమిటీ,  ఎందుకు?
X

తాజాగా సింగపుర్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం సుమారు 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ఉన్నపలంగా కుదుపులకు లోనైంది. భారీగా డ్యామేజ్ అయిన రోడ్డులో డొక్కు బస్సు ప్రయాణం తరహాలో విమానం గాల్లో ఉండగా తీవ్రమైన కుదుపులు సభవించాయి. వాటివల్ల ఓ ప్రయాణికుడు మరణించగా.. 30 మందికి పైగా గాయపడ్డారంటే ఆ కుదుపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ సమయంలో... అసలు విమానాలు గాల్లో ఉన్నవేళ ఎందుకు ఇలా జరుగుతుందనే చర్చ మొదలైంది.

ఫ్లైట్ టర్బులెన్స్‌ అంటే ఏమిటి?

విమానం గాల్లో ఉన్నప్పుడు సంభవించే ఆకస్మిక కుదుపు గురించి తరచుగా ప్రయాణించే వారికి బాగా తెలుస్తుందని అంటారు. ఈ టర్బులెన్స్ విమానాన్ని కుదిపేస్తుంది. ఫలితంగా ఎత్తులో ఆకస్మిక మార్పులకు కారణమవుతుంది. చాలావరకూ ఈ పరిస్థితి మేఘాల పైన లేదా కింద ఉన్న గాలి కారణంగా చోటు చేసుకొంటుంది.

"క్లియర్ ఎయిర్" టర్బులెన్స్ అని పిలువబడే మరొక రకమైన అల్లకల్లోలం విమానాలలో భారీ కుదుపులకు కారణమవుతుంది. దీనికి మేఘాలు ఉండకపోవడం తో వీటిని గుర్తించడం చాలా కష్టం అంటారు. అందువల్ల ఇవి చాలా సమస్యాత్మకమైనవని చెబుతారు. ఈ రకమైన టర్బులెన్స్ జెట్ స్ట్రీమ్ చుట్టూ జరుగుతుంది.

ఇది సాధారణంగా 40,000 - 60,000 అడుగుల ఎత్తులో గాలిలో వేగంగా ప్రవహించే సన్నని గాలి మార్గం అని ఏవియేషన్ అకడమిక్, కమర్షియల్ పైలట్స్ చెబుతున్నారు. సాధారణ మార్గంలో కంటే ఈ జెట్‌ స్ట్రీమ్‌ లు ఉన్న చోట్ల గాలి వేగం కనీసం 100 మైళ్లు అధికంగా ఉంటుందని అంటున్నారు.

టర్బులెన్స్ ఎంత ప్రమాదకరం?

సాధారణంగా విమానాలను దారుణమైన టర్బులెన్స్‌ లను తట్టుకొనేలా నిర్మిస్తారని.. అత్యంత అరుదుగా మాత్రమే అవి విమానాలను ధ్వంసం చేయగలుగుతాయని చెబుతున్నారు క్రాన్‌ ఫీల్డ్ యూనివర్సిటీలో ఏవియేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ మిస్టర్ గ్రాటన్! ఈ సమయంలో పైలట్లు సాధ్యమైనంత వరకు గాలి అస్థిర ప్రవాహాల్లోకి వెళ్లకుండా చూసుకొంటారని అంటున్నారు.

తీవ్రమైన టర్బులెన్స్ విమాన ప్రయాణీకులకు ప్రమాదకరంగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే.. ఇది ప్రమాదకరమైన కదలికను కలిగిస్తుంది. ఆ సమయంలో సీట్‌ బెల్ట్ ధరించని వారిని క్యాబిన్‌ కు ఒకవైపు నుంచి మరోవైపు విసిరివేయవచ్చని.. అయితే టర్బులెన్స్ వల్ల మరణాలు, గాయాలు చాలా అరుదుగా జరుగుతాయని విమానయాన భద్రతా నిపుణులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో... 2009 - 2022 మధ్య యూఎస్ ఆధారిత ఎయిర్‌ లైన్స్‌ లో 163 తీవ్రమైన టర్బులెన్స్ ప్రమాదాలు జరిగాయని అమెరికా నేషనల్ ట్రాన్స్‌ పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ తెలిపింది. అంటే... సగటున సంవత్సరానికి 12 అన్నమాట!

ప్రయాణికులు సురక్షితంగా ఉండేందుకు ఏం చేయాలి?

విమానాల్లో సీటు బెల్టులను కచ్చితంగా ధరించాలి. వీటిని పాటించని వారు క్యాబిన్‌ లో ఏదో మూలకు విసిరేసినట్లు పడిపోయే ప్రమాదం ఉందని, ఫలితంగా తీవ్ర గాయాలపాలవుతారని అమెరికాలోని నేషనల్‌ ట్రాన్స్‌ పోర్టు సేఫ్టీ బోర్డ్‌ చెబుతోంది. ఇదే సమయంలో బరువైన వస్తువులు ఏవీ బయటకు రాకుండా కేబిన్స్ ని చూసుకోవాలని సలహా ఇస్తుంటారు!