హైటెన్షన్‌లో మహిళా నేత.. సెగ్మెంట్ ఈక్వేషన్స్ ఏంటి?
ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో ఒకప్పుడు స్థిరమైన ఓటు బ్యాంకు.. స్థిరమైన నాయకత్వానికి ఓటర్లు జై కొట్టేవారు. కానీ, ఇటీవల కాలంలో పరిస్థితి మారిపోయింది.
By: Tupaki Desk | 18 Aug 2026 4:00 AM ISTఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో ఒకప్పుడు స్థిరమైన ఓటు బ్యాంకు.. స్థిరమైన నాయకత్వానికి ఓటర్లు జై కొట్టేవారు. కానీ, ఇటీవల కాలంలో పరిస్థితి మారిపోయింది. సెంటిమెంటు కంటే కూడా.. స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి.. తమకు అందుబాటులో ఉంటున్న నాయకులను ప్రజలు కోరుకుంటున్నారు. దీంతో ఒకప్పుడు ఎస్సీలకు కలిసి వచ్చిన రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి. ఇలాంటి వాటిలో ఉమ్మడి అనంతపురంలోని శింగనమల సీమలో ప్రముఖంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
2004లో ఏర్పడిన శింగనమల నియోజకవర్గంలో తొలి రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకుంది. 2014లో టీడీపీ బోణీ కొట్టింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పట్టం కట్టారు. ఇక, తాజాగా 2024లో మరోసారి టీడీపీ కి ప్రజలు జైకొట్టారు. ఈ పరిణామాలను గమనిస్తే.. శింగనమల ప్రజలు నాయకుల కంటే కూడా.. స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి, ముఖ్యంగా రాజకీయ దుమారాలు లేని పరిస్థితిని కోరుకుంటున్నారు. 2019లో గెలిచిన జొన్నలగడ్డ పద్మావతి వ్యవహారం వివాదం కావడంతోనే ప్రజలు ఆమెను వ్యతిరేకించారు.
దీంతో గత ఎన్నికల్లో అసలు టికెట్ కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. ఇక, ఇప్పుడు టీడీపీ తరఫున తొలిసారి విజయం దక్కించుకున్న బండారు శ్రావణికి ప్రస్తుతం అంతగా సానుకూలత కనిపించడం లేదని పలు నివేదికలు సహా .. విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ముఖ్యంగా 2 విషయాల్లో ఆమెపై అసంతృప్తి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి శ్రావణి డౌన్ టు ఎర్త్ అన్నట్టుగానే ప్రజలకు చేరువ అవుతున్నారు. ప్రజల మధ్య కూడా ఉంటున్నారు. పార్టీ తరఫున కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.
కానీ, అంతర్గత కుమ్ములాటలను నివారించలేక పోతున్నారన్నది బండారుపై వస్తున్న ప్రధాన విమర్శ. క్షేత్రస్థాయి లో కార్యకర్తలను ఆమె ఆశించిన మేరకు సంతృప్తి పరచలేకపోతున్నారన్న వాదన ఉంది. కనీసం తమకు సామాజిక భద్రత పింఛన్లు ఇప్పించాలని పలు కుటుంబాలు కోరుతున్నాయి. కానీ, దీనిపై ఏమీ తేల్చలేక పోతున్నారు. ఇక, ఇదే నియోజకవర్గంలో టీడీపీకి చెందిన మరో నేత కన్నేయడం.. ఆయన దూకుడుగా రాజకీయాలు చేస్తుండడం కూడా బండారుకు టెన్షన్ పెడుతోంది.
వచ్చే ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న సదరు నాయకుడు.. తరచుగా ఇక్కడ పర్యటిస్తున్నారు. ఇక్కడి సమస్యలపై మాట్లాడుతున్నారు. అధికారులు, పోలీసులతో కలివిడిగా ఉంటున్నారన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ. ఇది వచ్చే ఎన్నికల నాటికి మరింత పెరుగుతుందన్న అంచనా ఉంది. ఈ నేపథ్యంలో తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు శ్రావణి మరింత కష్టపడాల్సిన ఏర్పడింది. మొత్తంగా రెండున్నరేళ్ల కాలంలో బండారు తనదైన ముద్ర అయితే వేయలేకపోయారన్నది స్థానికంగా టీడీపీ నేతల మధ్య జరుగుతున్న చర్చ.
